మండల స్థాయిలో ప్రతి సోమవారం మీకోసం..
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:13 PM
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
అన్ని శాఖల అధికారులు విధిగా హాజరుకావాలి
పంచాయతీ, మండల స్థాయి
సమస్యలు అక్కడే పరిష్కరించాలి
పీజీఆర్‌ఎస్‌లో 109 వినతులు స్వీకరణ
పాడేరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీ మండల కేంద్రంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పక్కాగా పరిశీలించి అర్జీదారులకు సంపూర్ణంగా న్యాయం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఒక సమస్యపై పదే పదే కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీ, మండల స్థాయిల్లోని సమస్యలను ఎట్టిపరిస్థితుల్లో మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో జిల్లా, డివిజన్ స్థాయి సమస్యలపై మాత్రమే అర్జీలు వచ్చేలా అధికారులు కృషిచేయాలన్నారు. అలాగే ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఆర్‌డీవో లోకేశ్వరరావు ప్రజల నుంచి 109 వినతులను స్వీకరించారు.
1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
మీకోసం కార్యక్రమంలో అర్జీదారులు దాఖలు చేసిన వ్యక్తులు తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, సూచించారు. అర్జీదారులుకాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయిక్, డీఈవో కె.రామకృష్ణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, స్వర్ణ గ్రామ శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , జాతీయ రహదారుల డీటీ వి.ధర్మరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.