మరణంలోనూ ఒక్కటిగానే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:55 AM
వారిద్దరూ ఒకే తల్లికి జన్మించారు.. సుమారు ఐదు దశాబ్దాలపాటు కలిసిమెలిసి పెరిగారు.. చివరకు కలిసే ఈ లోకాన్ని వీడారు. మండలంలోని తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాలివి.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం
తాళ్లపాలెం వద్ద హైవేపై దుర్ఘటన
సొంతూరు రాంబిల్లి మండలం దిమిలి
కశింకోట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ఒకే తల్లికి జన్మించారు.. సుమారు ఐదు దశాబ్దాలపాటు కలిసిమెలిసి పెరిగారు.. చివరకు కలిసే ఈ లోకాన్ని వీడారు. మండలంలోని తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాలివి.
రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి తాతాజీ (51), జనపరెడ్డి వెంకటేశ్వరరావు (47) స్వయానా అన్నదమ్ములు. కొంతకాలం నుంచి పరవాడలో నివాసం వుంటున్నారు. సొంతూరులో వున్న కొంత సామగ్రిని పరవాడ తీసుకెళ్లేందుకు రాంబిల్లి వెళ్లారు. అక్కడి నుంచి సామాను తీసుకొని ద్విచక్ర వాహనంపై పరవాడ బయలుదేరారు. తాళ్లపాలెం వద్ద వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ట్రాలీ ఎడమవైపు వున్న ఇనుప హుక్, వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం హ్యాండిల్‌కు తగిలింది. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. రెప్పపాటులో కంటైనర్ ట్రాలీ వెనుక టైర్లు వీరిపై నుంచి వెళ్లాయి. శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందారు. తాతాజీ అనకాపల్లిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. వెంకటేశ్వరరావు రోజువారీ కూలి పనులకు వెళుతుంటాడు. తాతాజీకి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమారులు, వెంకటేశ్వరరావుకు భార్య దేవి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ అల్లు స్వామినాయుడు పరిశీలించారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రాలీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.