Share News

హక్కు ఉన్నా వెదురుచూపులే..!

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:06 PM

అటవీ ప్రాంతాల్లో వెదురు సేకరించి అమ్ముకునే హక్కు గిరిజనులకు ఉంది. ఈ మేరకు పదిహేన్నేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

హక్కు ఉన్నా వెదురుచూపులే..!
బొయింతి రిజర్వు ఫారెస్టు మర్రిపాకలు రేంజ్‌లో వెదురు నరికి కుప్పలుగా వేసిన దృశ్యం (ఫైల్‌ ఫొటో)

గిరిజనులు వెదురు సేకరణపై అటవీశాఖ అభ్యంతరాలు

దశాబ్దంన్నర క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా ఆటంకాలు

మూడేళ్ల క్రితం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినా దక్కని అవకాశం

ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు

కొయ్యూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లో వెదురు సేకరించి అమ్ముకునే హక్కు గిరిజనులకు ఉంది. ఈ మేరకు పదిహేన్నేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయినా అటవీశాఖ అభ్యంతరాల కారణంగా ఇప్పటికీ వెదురుపై గిరిజనులకు హక్కు లేకుండాపోయింది. అటవీశాఖ కేవలం అందుబాటులో ఉన్న వెదురు మాత్రమే సేకరించి మిగిలినది వదిలేస్తుండడంతో చాలా వరకు వెదురు నిరుపయోగంగా ఉంటోంది. ఇటు అటవీశాఖకు ఆదాయం రాకపోగా, అటు గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు.

అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు వెదురు సేకరించి అమ్ముకోవచ్చునని 2011లో అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీని ప్రకారం గిరిజన మహిళలు సంఘాలుగా ఏర్పడి వెదురు సేకరించి విక్రయించుకోవచ్చు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నాతవరంలో అప్పట్లో గిరిజనులు వెదురు అమ్మకాలు ప్రారంభించారు. అయితే అటవీశాఖ అభ్యంతరాలతో ఇది ఎక్కువ కాలం సాగలేదు. కాగా తొమ్మిదేళ్ల క్రితం వెదురును అటవీయేతర ప్రాంతాల్లో కూడా గిరిజనులు అమ్ముకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి తోడు 1926 నాటి అటవీ చట్టాన్ని సవరిస్తూ మూడేళ్ల క్రితం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించింది. ఇన్ని పరిణామాలు జరిగినా అటవీశాఖ తీరు వలన గిరిజనులకు మాత్రం వెదురుపై హక్కు రాలేదు.

వృథాగా పడి ఉన్న వెదురు

చింతపల్లి అటవీ డివిజన్‌లో ఎక్కువగా వెదురు కూపీలున్నాయి. ఏటా 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో వెదురు తీసే అవకాశం ఉంది. దీని ద్వారా అటవీశాఖకు రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. డివిజన్‌ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వెదురులో కేవలం 40 శాతం మాత్రమే అటవీశాఖ సేకరిస్తోంది. మిగిలినది తీసేందుకు వీలులేక వదిలిపెడుతోంది. దీంతో కొండలపై వెదురు వృథాగా ఉంటోంది. గత 2023లో సేకరించిన వెదురులో సుమారు 30 వేల వెదురు బొంగులు అమ్మకాలకు నోచుకోక అటవీ డిపోల్లోనే పేరుకుపోయాయి. దీంతో రెండేళ్ల నుంచి అటవీశాఖ వెదురు సేకరణకు స్వస్తి చెప్పింది.

గిరిజనులకు అవకాశం కల్పిస్తే..

ప్రస్తుతం వెదురును ఎక్కడ నుంచి తీసుకువచ్చినా అటవీశాఖ పట్టుకుంటోంది. గతంలో రాజమండ్రి పేపర్‌మిల్లు మన్యం వెదురును వినియోగించేది. ప్రస్తుతం మైదానంలో సుబాబుల్‌, సరుగుడు, యూకిలిప్టస్‌ వంటి కలపను పేపర్‌మిల్లు వినియోగిస్తూ మన్యం వెదురును వదిలేసింది. అటవీశాఖ సాధ్యమైనంత వరకు వెదురును దినకూలీ ప్రాతిపదికన గిరిజనులతోనే సేకరించి నిల్వ కేంద్రాల వద్ద ఉంచుతుంది. నెలకు ఒకసారి వేలం వేస్తుంది. ప్రస్తుతం వెదురు ఒక్కింటికి సైజును బట్టి స్థానికంగానే రూ.200-400 మద్య ధర పలుకుతోంది. అయితే అటవీశాఖ సేకరించగా మిగిలిన వెదురు అయినా గిరిజనులు సేకరించుకుని అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఆర్థికంగా వారు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. వెదురు సేకరణలో తమకు అటవీ శాఖ అభ్యంతరం చెప్పకుండా చూడాలని ప్రభుత్వాన్ని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:07 PM