Share News

మరింత మెరుగ్గా రెవెన్యూ సేవలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:19 PM

జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత మెరుగ్గా అందించాలని, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు.

మరింత మెరుగ్గా రెవెన్యూ సేవలు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న జేసీ టి.శ్రీపూజ

ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి

అధికారులకు జేసీ టి.శ్రీపూజ ఆదేశం

భూముల రీసర్వే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచన

పాడేరు, సెప్టెబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత మెరుగ్గా అందించాలని, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో బుఽధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. అధికారులు గ్రామసభలు నిర్వహించి అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహహన కల్పించాలన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పట్టాదారుపాస్‌ పుస్తకాల పంపిణీ సకాలంలో జరగాలని, అందుకు మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,400 గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియలను ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో జరిగిన రీసర్వే వివరాలను తొలుత సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపించి రికార్డుల పరిశీలన జరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎంల స్పందన ప్రక్రియలో నాణ్యత, సంతృప్తి శాతాన్ని పెంచాలని సూచించారు. ఎక్కడైనా ఐవీఆర్‌ఎస్‌లో సంతృప్తికర సేవలు అందని పరిస్థితులుంటే సంబంధిత తహశీల్దార్‌ ఆ ఫైల్‌తో కలెక్టరేట్‌కు హాజరుకావాలన్నారు. జిల్లాలో భూముల మ్యుటేషన్‌ ప్రక్రియ పక్కాగా జరగాలని, ఎటువంటి లోటు పాట్లు జరగకూడదన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:19 PM