నారు పోసినా నీరు లేక..
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:55 AM
మండలంలో పది రోజులుగా వర్షాలు లేక ఖరీఫ్ సాగుకు కష్టాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల వరి విత్తనాలు వేసి భూమిలో తగినంత తేమ లేక వేసిన విత్తనం మొలక రాలేదు. మరికొన్ని చోట్ల మొలకొచ్చి ఎదిగే సమయంలో వర్షాలు కురవక నారుమడులు బీటలు వారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు గత్యంతరం లేక ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులను తడుపుతున్నారు.
- వర్షాలు కురవక ఎండిపోతున్న వరి నారుమడులు
- బక్కెట్లతో నీళ్లు పోసి కాపాడుకుంటున్న రైతులు
- కల్యాణపులోవ రిజర్వాయర్ కింద కూడా అదే పరిస్థితి
రావికమతం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో పది రోజులుగా వర్షాలు లేక ఖరీఫ్ సాగుకు కష్టాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల వరి విత్తనాలు వేసి భూమిలో తగినంత తేమ లేక వేసిన విత్తనం మొలక రాలేదు. మరికొన్ని చోట్ల మొలకొచ్చి ఎదిగే సమయంలో వర్షాలు కురవక నారుమడులు బీటలు వారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు గత్యంతరం లేక ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులను తడుపుతున్నారు.
ఈ ఏడాది మండలంలో 2,181 హెక్టార్లలో రైతులు ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమయ్యారు. మండలంలోని ఒక్క కల్యాణపులోవ రిజర్వాయర్ కింద మూడు వేల ఎకరాలు మినహా మిగిలిన భూములన్నీ వర్షాధారంపైనే సాగవుతున్నాయి. గత ఏడాది వరి బాగానే పండినప్పటికీ కోతల సమయంలో తెగుళ్లు విపరీతంగా ఆశించడంతో రైతులు సొంతంగా విత్తనాలు సిద్ధం చేసుకోలేకపోయారు. దీంతో అప్పులు చేసి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు వరి విత్తనాలు కొనుగోలు చేసి నారు పోశారు. నారు పోసిన నాటి నుంచి వర్షాలు పడలేదు. భూమిలో తేమకు వేసిన విత్తనాలు సక్రమంగా మొలక రాక, మొలకొచ్చి నారు ఎదిగే తరుణంలో వర్షాలు వెనకేయడంతో నారుమడులు నర్రలు వారాయి. గత నెలలో అడపాదడపా వర్షాలే తప్ప చెరువులు, బావులు, వాగులు నిండే విధంగా ఏనాడూ వర్షం కురవలేదు. వాస్తవానికి జూన్ నెలలో సాధారణంగా 123.6 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 143.5 ఎంఎం పడింది. సాధారణానికి 16.1 ఎంఎం మించే పడింది. అయితే వాస్తవానికి ఈ వర్షం కల్యాణపులోవ జలాశయ పరివాహక ప్రాంతంలో పడింది తప్ప, సాగు భూములున్న చోట కాదు. అలాగే జూలైలో 40.4 ఎంఎం పడాల్సి ఉండగా, ఇంతవరకు 10 ఎంఎం మాత్రమే పడింది. దీంతో ఎక్కడా చెరువులు గాని, బావుల్లో గాని నీటి చుక్క చేరలేదు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగి నారుమడులు ఎండిపోతున్నాయి. నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లోని రైతులు ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులను తడుపుకుంటున్నారు.
కల్యాణపులోవ రిజర్వాయర్ కింద కూడా అంతే..
కల్యాణపులోవ రిజర్వాయర్ కింద కూడా నారుమడులను నీటితో తడపాల్సి వస్తోంది. రిజర్వాయర్‌లో 460 అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 451.04 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఆశించినంతగా వర్షాలు పడక ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌లోకి రాకపోవడంతో నీటి సామర్థ్యం పెరగలేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 454 అడుగుల మేర నీటి నిల్వలు ఉండేవని, ప్రస్తుతం ఉన్న నీరు రెండు వేల ఎకరాలకే దమ్ములకు సరిపోతుందని, అది నారుమడులకు ఇవ్వాల్సి వస్తే 1,500 ఎకరాలకే దమ్ములకు సరిపోతుందని కల్యాణపులోవ ఏఈ డి.సూర్య తెలిపారు.