ఏడాదైనా... పాత స్థానాల్లోనే!
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:06 AM
పాఠశాల విద్యాశాఖలో గత ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 100 మంది ఇప్పటికీ పాత పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు.
రిలీవర్లు లేక కొత్త స్థానాలకు వెళ్లని టీచర్లు
సర్దుబాటు ప్రక్రియ కోసం ఎదురుచూపులు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల విద్యాశాఖలో గత ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 100 మంది ఇప్పటికీ పాత పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. బదిలీ ఆర్డర్లు తీసుకున్న వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్టుచేసిన వారంతా తిరిగి పూర్వ స్కూళ్లకు వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. కొత్తగా పోస్టింగ్ వచ్చిన పాఠశాలలకు పంపాలని కోరుతున్నా విద్యాశాఖ నుంచి స్పందించలేదు.
ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనిమిదేళ్లపాటు మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలో పనిచేసిన టీచర్లు గత ఏడాది విశాఖ, అనకాపల్లి జిల్లా కేంద్రాల్లోని సమీప పాఠశాలలకు బదిలీ అయ్యారు. అయితే వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అప్పటివరకు పనిచేసిన పాఠశాల నుంచి వెళ్లాలంటే సదరు ఉపాధ్యాయుడిని రిలీవ్ చేయడానికి మరో టీచరు రావాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు పాతస్థానాలకే పరిమితమయ్యారు. వీరిలో సుమారు 60 మంది హిందీ స్కూలు అసిస్టెంట్లున్నారు. మిగిలిన సబ్జెక్టులకు టీచర్లు లేకపోయినా పాఠశాలలో ఉన్న ఇతర టీచర్లు బోధించే వీలుంది. కానీ హిందీ బోధన ఇతరులు చేయలేరు. దీంతో ఆ ఉపాధ్యాయులు ఏడాదిగా పాత చోటే పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో హిందీ టీచర్లకు కొరత ఉంది. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ప్రత్యామ్నాయంగా టీచర్లు లేకపోవడంతో వారిని రిలీవ్ చేయవద్దని సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలను విద్యాశాఖ ఆదేశించింది.
విద్యా సంవత్సరం ముగిసినా...
సాధారణంగా ప్రత్నామ్యాయం లేక బదిలీ చోటకు పంపే అవకాశం లేని సందర్భాల్లో విద్యా సంవత్సరం ముగిసిన చివరిరోజున రిలీవ్ చేసేవారు. ఉపాధ్యాయులు అదే రోజు కొత్త పాఠశాలలో రిపోర్టు చేసే వీలుండేది. కానీ విద్యాశాఖాధికారులు ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి, పాతస్థానాల్లోనే కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ టీచర్లు కొత్తగా బదిలీ అయిన పాఠశాల నుంచి జీతం తీసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో బదిలీలకు వచ్చే వెయిటేజ్ పాయింట్లలో కోత పడుతుంది. కేటగిరీ 3,4 పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు వచ్చే పాయింట్లు రావని వాపోతున్నారు.
సర్దుబాటుపై ఆశలు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో సబ్జెక్టు టీచర్ల కొరత నేపథ్యంలో సర్దుబాటు ప్రక్రియకు విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో ఏడాదిగా పాతస్థానాల్లో పనిచేస్తున్న తమకు ప్రాధాన్యమివ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. లేదంటే కనీస హక్కులు కోల్పోతామంటున్నారు. గత ఏడాది బదిలీ అయిన టీచర్లను తక్షణమే రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీఆర్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలో తీసుకోవాలని కోరారు.
నగరానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు
నేడు ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్, రేపు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాక
భోగాపురం మోడల్‌స్కూల్ సందర్శన, గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర, రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేశ్ నగరానికి రానున్నారు. ఈ నెల 30న జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేశ్ సోమవారం రాత్రి 8.30 గంటలకు విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి టీడీపీ కార్యాలయంలో బసచేస్తారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు టీడీపీ కార్యాలయం నుంచి నోవాటెల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కేంద్ర విద్యాశాఖామంత్రి ధరేంద్రప్రధాన్‌తో కలిసి విజయనగరం జిల్లా భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూలును సందర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు నోవాటెల్‌కు చేరుకుని, మూడు గంటల నుంచి జరగనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని సాయంత్రం ఐదుగంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు. కేంద్ర విద్యాశాఖామంత్రి ధరేంద్రప్రధాన్ మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటలకు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వస్తారు. ఆ తరువాత భోగాపురం మోడల్ స్కూలు సందర్శనకు వెళ్లి తిరిగి నోవాటెల్‌కు చేరుకుని గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు విమానంలో ఢిల్లీ వెళ్తారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దుచేసినట్టు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు జీవీఎంసీ ప్రధానకార్యాలయం, నగర పోలీస్‌కమిషనరేట్‌లో కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ద్రౌపదిముర్ము మంగళవారం నగరానికి వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణ పనుల కారణంగా పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామని, వచ్చే సోమవారం నుంచి యధావిధిగా జరుగుతుందని అధికారులు తెలిపారు.
నేడు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
మూడో విడత చందన సమర్పణకు ఏర్పాట్లు
సింహాచలం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
వరాహలక్ష్మీనృసింహస్వామికి మూడో విడత చందన సమర్పణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఏటా చందనోత్సవం అనంతరం నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో వైశాఖ తృతీయకు తొలివిడత, వైశాఖ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ చేశారు. జేష్టమాస పౌర్ణమి సందర్భంగా 29న వేకువజామున సుప్రభాత సేవ అనంతరం మూడో విడత చందనాన్ని సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో జరగాల్సిన సుప్రభాతసేవ, ప్రభాత ఆరాధన, సహస్రనామార్చన, గరుడసేవ, నిత్యకల్యాణం తదితర ఆర్జిత సేవలు రద్దుచేసినట్టు ఈవో తెలిపారు.