Share News

హస్త కళా హబ్‌గా ఏటికొప్పాక

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:50 AM

అంకుడు కర్రతో లక్క బొమ్మల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏటికొప్పాకను హస్త కళా హబ్‌గా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ అన్నారు.

హస్త కళా హబ్‌గా ఏటికొప్పాక
ఏటికొప్పాక హస్తకళా ఇతివృత్త ఉద్యానవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌. చిత్రంలో పర్యాటక శాఖ ఎండీ రవి పట్టన్‌శెట్టి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

పర్యాటక ప్రాంతంగా సైతం అభివృద్ధి

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌

ఏటికొప్పాక హస్తకళా ఇతివృత్త ఉద్యానవనానికి శంకుస్థాపన

ఎలమంచిలి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అంకుడు కర్రతో లక్క బొమ్మల తయారీలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏటికొప్పాకను హస్త కళా హబ్‌గా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ అన్నారు. ఏటికొప్పాకలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘‘ఏటికొప్పాక హస్తకళా ఇతివృత్త ఉద్యానవం’’కు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రావత్‌తోపాటు పర్యాటక శాఖ ఎండీ రవి పట్టన్‌ శెట్టి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ, ఎంతో ప్రాచుర్యం పొందిన జీ1 టాగ్‌ సాధించిన ఏటికొప్పాక హస్తకళను ప్రపంచ నలుమూలలా వ్యాపించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటికొప్పాక పరిసరాల్లో పచ్చటి కొండలు, పోలవరం కాలువ చూడడానికి ఎంతో బాగున్నాయని, అందువల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకుల కోసం ట్రెక్కింగ్‌, వాటర్‌ స్పోర్ట్సు, సాహస క్రీడలతోపాటు రాత్రి బస చేసేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ఇక్కడి కళాకారులను భాగస్వాములను చేస్తూ వారి నైపుణ్యానికి తగిన గుర్తింపు, ఆదాయం లభించేలా కళలు, ప్రకృతి అందాల కలయికతో ఏటికొప్పాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఏటికొప్పాక హస్తకళాకారుల అభ్యున్నతి కోసం పది ఎకరాల విస్తీర్ణంలో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏటికొప్పాక కళాకారులు పద్మశ్రీ పురస్కారంతోపాటు రాష్ట్రపతి అవార్డులను సైతం సొంతం చేసుకున్నారని కొనియాడారు. అనంతరం ఏటికొప్పాక గ్రామంలో అంకుడు కర్రను ఉపయోగించి సహజసిద్ధ రంగులతో తయారు చేస్తున్న కళారూపాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు వరహాలు, మాజీ సర్పంచ్‌ కాండ్రకోట చిరంజీవి, కూటమి నేతలు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గొన్నాబత్తుల శేషు, గెంజి శ్రీను, రాజాన నారాయణమ్మ, అన్నం బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:50 AM