ఏపీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఈశ్వరరావు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:12 AM
ఏపీఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా వరుసగా ఆరోసారి కొఠారు ఈశ్వరరావు ఎన్నికయ్యారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం
మహారాణిపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
ఏపీఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా వరుసగా ఆరోసారి కొఠారు ఈశ్వరరావు ఎన్నికయ్యారు. ఆయన గత పదిహేనేళ్లుగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. మూడేళ్ల కాలానికి ఎన్నికైన కొత్తకార్యవర్గంలో సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీ కృష్ణారావు పర్యవేక్షణలో ఏపీఎన్‌జీవో జిల్లా శాఖ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షునిగా కొఠారు ఈశ్వరరావు, కార్యదర్శిగా మండవ రవికుమార్, సహాధ్యక్షుడిగా కె.వరహాలుదొర, సహాయ కార్యదర్శిగా ఏవీఎస్ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా పి.అప్పలరాజు, ఉపాధ్యక్షులుగా కె.ఆనందరెడ్డి, కె.రమేష్‌నాయుడు, ఎ.రమేష్, పీవైఎస్ రత్నం, ఎస్.సత్తిబాబు, ఎ.వి.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా వై.ఎన్.ప్రసాద్, వి.ఎ.కృష్ణమోహన్, ఎస్.రజని, ఎం.శ్రీనివాస్, కె.అలివేలుమంగ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
ఈఎన్‌టీ వ్యవహారంపై ఆరోగ్య శాఖ సెక్రటరీ ఆరా
విచారణ పూర్తయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించిన సౌరబ్ గౌర్
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
ఈఎన్‌టీ ఆస్పత్రి ఉన్నతాధికారి వ్యవహారంపై విచారణ పూర్తిచేసినప్పటికీ, తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్‌గౌర్ ప్రశ్నించారు. ‘ఈఎన్‌టీలో ఆగని అరాచకం’ శీర్షికన ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, కేజీహెచ్ సూపరింటెండెంట్‌తోపాటు కమిటీలో సభ్యులుగా ఉన్న అధికారులను కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని ప్రశ్నించినట్టు తెలిసింది. కమిటీ నివేదిక ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని కమిటీ చైర్మన్ డాక్టర్ ఐ.వాణిని ఆయన ప్రశ్నించగా...తనకు ఆ అధికారం లేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. వెంటనే ప్రిన్సిపాల్‌ను ఆయన ప్రశ్నించగా డీఎంఈకి నివేదిక ఇచ్చామని, వారి ఆదేశాల కోసం చూస్తున్నట్టు వెల్లడించారు. జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్టు తెలిసింది. స్వయంగా ఆరోగ్య శాఖ సెక్రటరీ రంగంలోకి దిగడంతో రెండు, మూడు రోజుల్లో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.