అన్‌సెటిల్డ్ భూముల్లో పాగా!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:50 AM
ఆక్రమణదారుల చెర నుంచి అన్‌సెటిల్డ్ రెవెన్యూ గుర్తింపు లేని భూములను విడిపించి, వాటిని నిరుపేద రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా... మరోవైపు కొంతమంది రెవెన్యూ అధికారులతో అక్రమార్కులు కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు.
అక్రమణకు గురవుతున్న రెవెన్యూ గుర్తింపు లేని భూములు
సాగుదారుల ముసుగులో హస్తగతం చేసుకుంటున్న రియల్టర్లు
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఆక్రమణదారుల చెర నుంచి అన్‌సెటిల్డ్ రెవెన్యూ గుర్తింపు లేని భూములను విడిపించి, వాటిని నిరుపేద రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా... మరోవైపు కొంతమంది రెవెన్యూ అధికారులతో అక్రమార్కులు కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పలు గ్రామాల్లో రెవెన్యూ గుర్తింపు లేని భూములు, స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
రెవెన్యూ గుర్తింపు లేని గ్రామాల్లో భూముల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరచరు. కొంతమంది దీనిని అవకాశంగా చేసుకొని ఇటువంటి భూముల్లో పాగా వేస్తున్నారు. స్థానికంగా ఉండని రైతులను సాగుదారులుగా చెబుతూ భూములను తమ ఆధీనంలో పెట్టుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి, తాతముత్తాతల నుంచి దఖలు పడిన భూములుగా చెప్పుకొంటూ రెవెన్యూ గుర్తింపు లేని (అన్‌సెటిల్డ్) భూములను సొంతం చేసుకొంటున్నారు. అంతటి ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సబ్బవరం మండలంలో రెవెన్యూ గుర్తింపు లేని గ్రామాలు ఎనిమిది వరకు వున్నాయి. వీటి పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. దొంగలమర్రి సీతారామపురం రెవెన్యూ పరిధిలోని దేవీపురం, రాయపురం అగ్రహారం, టెక్కలిపాలెం, బోడువలస, గాలిభీమవరం గ్రామాల్లో సుమారు 450 ఎకరాల మేర రెవెన్యూ కోడ్ లేని భూములు ఉన్నాయి. ఆయా భూముల వివరాలు స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద లేవు. రెవెన్యూ గుర్తింపు లేని ఈ భూములు పలువురి చేతులు మారాయి.
గత వైసీపీ హయాంలో అనకాపల్లికి చెందిన కొందరు రైతుల ఆధీనంలో ఉన్న డీఎంఎస్ పురం, దేవీపురం, గాలిభీమవరం పరిధిలో 21 ఎకరాల రెవెన్యూ గుర్తింపు లేని భూములను విశాఖకు చెందిన ఒక ప్రముఖ వస్త్ర వ్యాపారి, మరో రియల్ వ్యాపారి కలిసి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. రెవెన్యూ గుర్తింపు లేకపోవడంతో.. సదరు వ్యాపారులు... ఆక్రమణలో ఉన్న రైతుల నుంచి భూములు కొనుగోలు చేసినట్టు అంగీకార ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దేవీపురం, గాలిభీమవరం గ్రామాల్లో రియల్టర్ కొనుగోలు చేసిన భూమి రెవెన్యూ గుర్తింపు లేని గ్రామంలో ఉందని, దీనిపై పూర్తి హక్కులు రెవెన్యూ శాఖకు మాత్రమే వుంటాయని అప్పట్లో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెంచర్ పనులు నిలిపేశారు.
ఇదిలా ఉండగా రియల్టర్ రెండు వారాల క్రితం రంగంలోకి దిగారు. అప్పట్లో అక్రమంగా కొనుగోలు చేసిన 21 ఎకరాల్లో యంత్రాలతో చదును పనులు చేయించి సరుగుడు, యూకలిప్టస్ మొక్కలు నాటించారు. ఇక్కడ జాతీయ రహదారికి సమీపంలో ఎకరం రూ.2 కోట్లు పలుకుతున్నది. దీనిప్రకారం సాగుదారుల నుంచి కొనుగోలు చేసిన రెవెన్యూ గుర్తింపు లేని భూమి విలువ రూ.40 కోట్ల వరకు వుంటుంది. అప్పట్లో సాగుదారులకు ఎకరాకు రూ.10-12 లక్షలు మాత్రమే చెల్లించి, ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వం మారినా...
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సబ్బవరం మండలంలో రెవెన్యూ గుర్తింపు లేని గ్రామాల్లో రీసర్వే జరిపించి, ఆక్రమణలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతారని అంతా భావించారు. కానీ ఈ భూముల విషయంలో ప్రభుత్వం ఇంతవవరకు నిర్ణయం తీసుకోలేదు. రెవెన్యూ గుర్తింపు లేని దొంగలమర్రి సీతారామపురం గ్రామంలోని ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఆక్రమించుకొని, సాగుదారుల పేరుతో అమ్ముకొని జేబులు నింపుకున్నారు. మరికొందరు నేతలు నర్సరీలు, ఆర్గానిక్ ఫామ్‌లు, పౌలీ్ట్ర ఫారాలకు అద్దెకు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.