ఈఎస్‌ఐ ఆస్పత్రి రెండు నెలల్లో రెడీ
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:16 AM
పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో రెండు నెలల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది. ఇంతవరకు ఆస్పత్రి ప్రధాన భవనం, సిబ్బంది గృహ సముదాయాల నిర్మాణం పూర్తయ్యింది.
అచ్యుతాపురంలో చివరి దశకు నిర్మాణ పనులు
30 పడకలతో మూడు అంతస్థుల భవనం
సిబ్బందికి నివాస గృహాలు
నవంబరు నుంచి వైద్య సేవలు?
అచ్యుతాపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో రెండు నెలల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది. ఇంతవరకు ఆస్పత్రి ప్రధాన భవనం, సిబ్బంది గృహ సముదాయాల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయా భవనాల్లో అంతర్గత పనులు జరుగుతున్నాయి. రహదారులు, డ్రైనేజీల నిర్మాణం జరగాల్సి వుంది. అక్టోబరు లేదా నవంబరులో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించే అవకాశం వుందని సమాచారం.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖ నగరంలో మాత్రమే ఈఎస్‌ఐ ఆస్పత్రి వుంది. ప్రత్యేక ఆర్థిక మండలి, నాన్-సెజ్ ఫార్మా కంపెనీలు వున్న అచ్యుతాపురంలో చిన్నపాటి డిస్పెన్సరీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఓపీ మాత్రమే వుంటుంది. పరిశ్రమలు, కంపెనీల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు తీవ్రంగా గాయపడుతున్నారు. వీరిని చికిత్స నిమిత్తం గాజువాక, విశాఖ నగరంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతున్నది. దీంతో సకాలంలో వైద్య సేవలందక క్షతగాత్రులు దారిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించి ప్రమాదాల్లో గాయపడిన కార్మికులు, ఉద్యోగులకు సత్వరమే వైద్యం అందడానికి అచ్యుతాపురంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2022లో ఈఎస్‌ఐ ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. అప్పటి వైసీపీ ప్రభుత్వం అచ్యుతాపురంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రత్యేకంగా భూమిని కేటాయించకుండా, సెజ్ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో రెండు ఎకరాలను 33 సంవత్సరాలపాటు లీజుకు తీసుకుంది. కానీ ఆస్పత్రి నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 30 పడకలతో మూడు అంతస్థులతో ఆస్పత్రి ప్రధాన భవనం, సిబ్బందికి 16 గృహాలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.62.21 కోట్లు కేటాయించింది. 2024 అక్టోబరు 29వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వాస్తవంగా ఈ ఏడాది మే నెలనాటికి పనులన్నీ పూర్తి చేసి ఆస్పత్రిని ప్రారంభించాల్సి వుంది. అయితే వివిధ కారణాల వల్ల నాలుగైదు నెలలు ఆలస్యమైంది. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు వుంటారు. 25 కిలోమీటర్ల పరిధిలోగల సుమారు 600 కర్మాగారాలు, సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి రెండు లక్షల మందికి వైద్య సేవలు అందుతుందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి ప్రధాన భవనం, సిబ్బంది గృహ సముదాయాల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతం భవనాల్లో అంతర్గత పనులు జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ పనులు మాత్రమే పూర్తి కావలసి ఉంది. అక్టోబరు నెలాఖరుకి పనులు పూర్తవుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు.