Share News

తుదిదశకు ఈఎస్‌ఐ ఆస్పత్రి

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:47 AM

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) షీలానగర్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

తుదిదశకు ఈఎస్‌ఐ ఆస్పత్రి

నిర్మాణం 90 శాతం పూర్తి

భూమి కేటాయిస్తే మెడికల్‌ కళాశాల కూడా మంజూరుచేస్తామన్న కేంద్ర కమిటీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) షీలానగర్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పదేళ్ల క్రితం అంటే 2016 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేసుకున్న ఈ ఆస్పత్రి...ఇప్పుడు పూర్తి కావస్తోంది. ఇక్కడ మొదట మెడికల్‌ కళాశాలతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు కోసం భూమి కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ భూ సమస్యల వల్ల అవసరమైనంత ఇవ్వలేదు. కేవలం 8.58 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. దాంతో మెడికల్‌ కాలేజీని పక్కనపెట్టి కేవలం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రినే రూ.384.26 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగానికి అప్పగించారు. 2025 అక్టోబరు నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 90 శాతం పూర్తయ్యాయి. ఇందులో 350 సాధారణ పడకలు, మరో 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మించారు. ఇటీవల పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర కమిటీ అనుబంధంగా మెడికల్‌ కాలేజీ నిర్మిస్తామని ప్రకటించింది. దీనికి అవసరమైన భూమిని కేటాయించాలని కోరింది. బీజేపీ నాయకులు కూడా విజయవాడలో కూటమి నేతలతో చర్చించి, షీలానగర్‌లోనే మరో ఐదు ఎకరాలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం మల్కాపురంలో గల ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 30 పడకలతో మరో ఆస్పత్రి నిర్మాణానికి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అంగీకరించింది.

భూమి కేటాయిస్తే కాలేజీ ఖాయం

రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం కూడా మెడికల్‌ కాలేజీకి భూమి కేటాయించలేకపోయింది. ఇప్పుడైనా ఆ పని విజయవంతంగా పూర్తిచేస్తే విశాఖలో మరో మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి వస్తుంది. పూర్తి కావచ్చిన ఆస్పత్రిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.

- పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ

ఫొటోలు ఎస్సీ అన్న ఫోల్డర్‌లో ఉంటాయి..


వసూలు కాని రుణాలు

వడ్డీ మాఫీ అన్నా...స్పందించని లబ్ధిదారులు

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2015-19 మధ్య ఉమ్మడి జిల్లాలో పలువురికి స్వయం ఉపాధి రుణాలు

ఏళ్లు గడుస్తున్నా అసలు కట్టని అత్యధికులు

అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటన

అయినా అరకొర స్పందన

విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాలు పొందినవారు అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలామంది స్వయం ఉపాధి రుణాలు తీసుకున్నారు. అందులో అత్యధికులు అసలు, వడ్డీ చెల్లించడం లేదు. దీంతో అసలు అయినా వసూలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రుణ గ్రహీతలకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు సమాచారాన్ని అందించారు. అయినప్పటికీ లబ్ధిదారులెవరూ ముందుకు రావడం లేదు.

నేషనల్‌ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), నేషనల్‌ షెడ్యూల్డ్‌ కులాల సఫాయి కర్మచారి ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) ద్వారా 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురికి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. రుణాల్లో కొంత సబ్సిడీగా, మరికొంత బ్యాంకు ద్వారా అందించారు. బ్యాంకు ద్వారా పొందిన రుణాలకు కొంత వడ్డీ కూడా చెల్లించాలి. అయితే, రుణాలు తీసుకున్న వారిలో చాలామంది వడ్డీతోపాటు అసలు కూడా చెల్లించడం లేదు. దీంతో రుణాలు పొందిన వారి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని రుణ గ్రహీతలకు అధికారులు తెలియజేస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అతికొద్దిమంది మాత్రమే రుణాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

భారీగా రుణాలు మంజూరు

విశాఖ జిల్లాలో 180 మందికి కోట్లాది రూపాయలు రుణాలు కింద అందించారు. వీరికి రూ.59,06,000 వడ్డీ మాఫీ చేయనున్నది. అలాగే, అనకాపల్లి జిల్లాకు చెందిన 344 మందికి ఇచ్చిన రుణాలకు సంబంధించి కోటి 33 లక్షల 29 వేల రూపాయల వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయనుంది. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఆరుగురు లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.8,29,000ను మాఫీ చేయాలని నిర్ణయించింది.

ఉపాధి పొందేందుకు రుణాలు

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించారు. ఈ రుణాలతో స్వయం ఉపాధి పొందేందుకు చికెన్‌ షాపులు, ఎలక్ష్టికల్‌ దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, టెంట్‌ హౌస్‌లు, టిఫిన్‌, మెడికల్‌ షాపులు, జెరాక్స్‌ సెంటర్లు వంటివి ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఆటోలు, ట్రాక్టర్లు కొనుక్కున్నారు. వీరిలో అతికొద్దిమంది మాత్రమే అసలు, వడ్డీ చెల్లిస్తుంటే, మెజారిటీ లబ్ధిదారులు చెల్లింపులకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

రుణ గ్రహీతలకు సమాచారాన్ని తెలియజేస్తున్నాం

- ఎం.సత్య పద్మ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఉమ్మడి విశాఖ జిల్లా

ఈ రెండు కార్పొరేషన్లు ద్వారా రుణాలు తీసుకున్న వారికి వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని లబ్ధిదారులకు తెలియజేస్తున్నాం. అసలు చెల్లించడం ద్వారా వడ్డీ మాఫీ పొందేందుకు అవకాశం దక్కింది. ఇది లబ్ధిదారులకు మేలు చేకూరుస్తుంది. ఒక్కో లబ్ధిదారుడు పొందిన రుణం బట్టి వేలాది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ రెండు కార్పొరేషన్లు ద్వారా సుమారు ఐదు వందల మంది వరకు రుణాలు పొందారు.

Updated Date - Feb 11 , 2026 | 12:47 AM