Share News

మార్కెట్‌ కమిటీల్లో ఈ-పర్మిట్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:08 AM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణా కోసం జూలై నుంచి ఈ-పర్మిట్‌ విధానం అమలు కానున్నది.

మార్కెట్‌ కమిటీల్లో ఈ-పర్మిట్‌

వచ్చే నెల ఒకటి నుంచి అమలు

అక్రమాలు, అవినీతికి చెక్‌

వ్యాపారులంతా ట్రేడ్‌ లైసెన్సులు పొందాల్సిందే

ఆన్‌లైన్‌లో సెస్సు చెల్లించిన తరువాతే పర్మిట్‌ జారీ

మార్కెట్‌ యార్డులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం

చోడవరం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణా కోసం జూలై నుంచి ఈ-పర్మిట్‌ విధానం అమలు కానున్నది. వ్యవసాయ, వాణిజ్య పంటల కొనుగోలు, రవాణా చేసే వ్యాపారులంతా తప్పనిసరిగా లైసెన్సు పొందాలి. ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో సెస్సు చెల్లించి పర్మిట్‌ పొందిన తరువాత ఆయా పంటలను రవాణా చేసుకోవాల్సి వుంటుంది.

మార్కెట్‌ కమిటీల పరిధిలో వ్యవసాయ, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఇప్పటి వరకు మాన్యువల్‌ పద్ధతిలోనే పర్మిట్లు జారీ చేస్తున్నారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్‌లోనే పర్మిట్ల జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూపొందించిన యాప్‌ ద్వారా ఈ-పర్మిట్‌ సులభతరంగా జారీ చేసే విధానంపై ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగులకు ప్రభుత్వం శిక్షణ ప్రారంభించింది. మార్కెట్‌ కమిటీల పరిధిలోని వ్యాపారులు ఇకపై తమ ఉత్పత్తులను ఈ-పర్మిట్‌ ద్వారానే రవాణా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్‌ కమిటీ చెక్‌ పోస్టుల వద్ద ఉత్పత్తులకు పర్మిట్ల జారీకి గతంలో నగదు తీసుకుని ఇచ్చే విధానాన్ని కూడా నిలిపివేసి, చెక్‌ పోస్టుల వద్ద కూడా యాప్‌ ద్వారానే పేమెంట్‌ చెల్లించి ఈ-పర్మిట్‌ పొందాలి.

లోపాలు, అక్రమాలకు చెక్‌

వ్యవసాయ, వాణిజ్య పంటల ఎగుమతులకు అవసరమైన పర్మిట్లను ఇంతవరకు ఆయా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు మాన్యువల్‌ పద్ధతిలోనే జారీ చేస్తున్నాయి. ట్రేడ్‌ లైసెన్స్‌ వ్యాపారులు ఆయా మార్కెట్‌ కమిటీలు ఇచ్చే పర్మిట్లతోనే ఆయా పంటను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. లైసెన్సులేని వ్యాపారులైతే ఆయా చెక్‌ పోస్టుల వద్ద సిబ్బందికి నగదు చెల్లించి పర్మిట్లు పొందుతున్నారు. ఈ తరహా జారీ చేస్తున్న పర్మిట్లకు, రవాణా చేస్తున్న ఉత్పత్తులకు పొంతన లేకపోవడం, మరికొన్ని చోట్ల వ్యవసాయ మార్కెట్‌ చెక్‌గేట్ల వద్ద సిబ్బంది చేతులు తడిపి, పర్మిట్లు లేకుండానే ఉత్పత్తులను తరలించడం వంటి కారణాలతో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి గండిపడుతున్నది. ఇంకా ఒకే పర్మిట్‌పై పలు వాహనాల్లో ఉత్పత్తులు రవాణా చేయడం, తనిఖీలు చేసే చెక్‌ పోస్టుల వద్ద మామూళ్లు ఇవ్వడం వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతున్నది. చాలామంది వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా చెక్‌పోస్టుల వద్ద మామూళ్లు చెల్లించి దొడ్డిదారిన ఉత్పత్తులను రవాణా చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిఽధిలో వ్యవసాయ, వాణిజ్య పంటల ఉత్పత్తుల వ్యాపారాలు చేసేవారి సంఖ్యకు, పర్మిట్లు తీసుకునే వ్యాపారుల సంఖ్యకు పొంతన లేకపోవడానికి ఇదేకారణమని అంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిఽఽధిలో ఉత్పత్తుల రవాణాలో అక్రమాలకు చెక్‌ పెట్టడంతో పాటు ప్రభుత్వానికి సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం, వ్యాపారులను లైసెన్సు విధానంలోకి తీసుకు వచ్చేందుకు ఈ-పర్మిట్‌ విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్న దృష్ట్యా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సిబ్బందికి ఈ-పర్మిట్‌ విధానంపై శిక్షణ ఇచ్చారు.

అందరూ లైసెన్సు పొందాల్సిందే...

ప్రస్తుతం నాన్‌-లైసెన్సు వ్యాపారులకు చెక్‌ పోస్టుల వద్ద సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ యాప్‌లో పర్మిట్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇది కొద్ది కాలమే ఉంటుందని అంటున్నారు. లైసెన్సులేని వ్యాపారులు సైతం తప్పనిసరిగా రిజిసే్ట్రషన్‌ చేసుకుని లైసెన్సు పొంది భవిష్యత్తులో ఈ-పర్మిట్‌ ద్వారానే ఉత్పత్తులను రవాణా చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సు పొందడం, ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో సెస్సు చెల్లించి పర్మిట్‌ పొందిన తరువాత ఉత్పత్తులను రవాణా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ-పర్మిట్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.


చేపల మృతిపై ప్రభుత్వం సీరియస్‌

సమగ్ర విచారణకు మత్స్య శాఖను ఆదేశించిన డిప్యూటీ సీఎం, హోం మంత్రి

సముద్ర తీరంలో మృతిచెందిన చేపల సేకరణ

విశ్లేషణ కోసం కాకినాడలోని ఎస్‌ఐఎఫ్‌టీకు తరలింపు

నక్కపల్లి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని బోయపాడు సముద్ర తీరంలో శనివారం పెద్ద ఎత్తున చేపలు చనిపోయిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. దీంతో సోమవారం మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జాతీయ జలచర జంతు వ్యాధుల పర్యవేక్షణ (ఎన్‌ఎస్‌పీ ఏఏడీ) బృందం బోయపాడు తీరంలో మృత్యువాతపడిన చేపలను పరిశీలించారు. కొన్ని చేపల నమూనాలను సేకరించారు. అదే విధంగా సముద్రంలో నీటి నమూనాలను కూడా సేకరించి, విశ్లేషణ నిమిత్తం కాకినాడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రయోగశాలకు పంపనున్నట్టు మత్స్య శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌ చెప్పారు. ఈ బృందం ఇంకా నక్కపల్లి మండలం బంగారమ్మపేట, పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీర ప్రాంతాల్లో వున్న పలు రొయ్యల చెరువుల నుంచి కూడా నమూనాలను సేకరించింది. యంగ్‌ ప్రొఫెషనల్‌ ఎన్‌ఎన్‌ చైతన్య, జూనియర్‌ కన్సల్టెంట్‌ పి.శ్రీనివాస్‌, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లు జె.పూర్ణిమ, శివాజీ, త్రినాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


మైనర్‌ డ్రైవింగ్‌

పట్టుకున్న పోలీసులు

రూ.5,035 జరిమానా

వాహనం ఇచ్చిన బంధువులకు కౌన్సెలింగ్‌

నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం రూరల్‌ ఎస్‌ఐ రాజారావు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం మండలంలోని ఓఎల్‌ పురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక బాలుడు ద్విచక్ర వాహనాన్ని (హోండా యాక్టివా) నడుపుకుంటూ రావడాన్ని గమనించి ఆపారు. వివరాలు తెలుసుకొని, బాలుడికి ద్విచక్ర వాహనం ఇచ్చిన అతని బంధువులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. మైనర్‌ డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేసి రూ.5.035 జరిమానా విధించారు. వాహనం ఇచ్చిన బంధువులకు కౌన్సెలింగ్‌ చేశారు.

Updated Date - Jun 23 , 2026 | 01:08 AM