రాంబిల్లిలో ఈ-ప్యాక్ యూనిట్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:07 AM
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన రెండు పారిశ్రామిక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాంబిల్లి మండలంలో రూ.570.2 కోట్ల పెట్టుబడితో ఈ-ప్యాక్ మాడ్యులర్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు, నక్కపల్లి మండలం బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటెరో గ్రూప్ సంస్థలకు 173.82 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రూ.570 కోట్లతో మాడ్యులర్ ఎక్విప్‌మెంట్ తయారీ ప్లాంట్
2,565 మందికి ప్రత్యక్ష ఉపాధి
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరోకు 173.82 ఎకరాలు కేటాయింపు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన రెండు పారిశ్రామిక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాంబిల్లి మండలంలో రూ.570.2 కోట్ల పెట్టుబడితో ఈ-ప్యాక్ మాడ్యులర్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు, నక్కపల్లి మండలం బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటెరో గ్రూప్ సంస్థలకు 173.82 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ-ప్యాక్‌తో తయారీ రంగానికి ఊతం
రాంబిల్లిలో ఏర్పాటు కానున్న ఈ-ప్యాక్ మాడ్యులర్ ఎక్విప్‌మెంట్ తయారీ ప్లాంట్ ద్వారా ఆధునిక ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీఎస్), ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ భవనాలు, ఇన్సులేటెడ్ శాండ్‌విచ్ ప్యానెల్స్, మాడ్యులర్ నిర్మాణ వ్యవస్థలు, పారిశ్రామిక షెడ్లు, గిడ్డంగులు, సైట్ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ పద్ధతిలో భవన నిర్మాణంతో పోలిస్తే, ఈ విధానంలో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో నిర్మించవచ్చు. ఈ యూనిట్‌లో అత్యాధునిక యంత్రాలతో ఉక్కు నిర్మాణ భాగాల తయారీ, వెల్డింగ్, కట్టింగ్, ఫ్యాబ్రికేషన్, నాణ్యత పరీక్షలు వంటి చేపడతారు. చేపట్టనున్నారు. తయారైన మాడ్యులర్ భాగాలను అవసరమైన ప్రదేశానికి తరలించి, వేగంగా అమర్చే సౌలభ్యం వుండడంతో పారిశ్రామిక, వాణిజ్య, విద్య, వైద్య రంగాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వీటి వినియోగం పెరుగుతుంది. ఈ యూనిట్ నిర్మాణం పూర్తయితే సుమారు 2,565 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
హెటెరోకు భూ కేటాయింపు
నక్కపల్లి మండలంలోని బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటెరో గ్రూపు సంస్థకు 173.82 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఔషధ రంగంలో మరింత ఉత్పత్తి పెరగడానికి మార్గం సుగుమం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఔషధ తయారీ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.