Share News

ఈ-ఆఫీస్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:14 AM

పాలనలో వేగం, పారదర్శకతతో పాటు పేపర్‌లెస్‌ సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఈ-ఆఫీస్‌’ అమలుకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల, కేజీహెచ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఫైళ్ల కదలికలో జాప్యాన్ని నిరోధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ-ఆఫీస్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

ఈ-ఆఫీస్‌
పరిశీలిస్తున్న అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ

పాలనలో వేగం, పారదర్శకతే లక్ష్యం

ఈ నెల 16 నుంచి

అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం

కేజీహెచ్‌, ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో

అధికారులు ఏర్పాట్లు

కంప్యూటర్లు, స్కానర్లు కొనుగోలు

ఉద్యోగులకు నాలుగుసార్లు శిక్షణ

విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

పాలనలో వేగం, పారదర్శకతతో పాటు పేపర్‌లెస్‌ సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఈ-ఆఫీస్‌’ అమలుకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల, కేజీహెచ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఫైళ్ల కదలికలో జాప్యాన్ని నిరోధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ-ఆఫీస్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్ర మెడికల్‌ కళాశాల, కేజీహెచ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పనిచేసే 22 మంది, కేజీహెచ్‌లో పనిచేసే 67 మంది మినిస్ర్టీరియల్‌ సిబ్బందికి నాలుగుసార్లు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. సిబ్బందికి అవసరమైన యూజర్‌ ఐడీ, డిజిటల్‌ సైన్‌ (సంతకం) అందించడంతోపాటు లాగిన్‌ చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ ఆఫీస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కొత్తగా 53 కంప్యూటర్లు, ఆరు స్కానర్లను కొనుగోలు చేశారు. ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ దగ్గరుండి విభాగాల్లో సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఫైళ్లను ఉన్నతాధికారులు వద్దకు పంపించడం, మళ్లీ వెనక్కి వచ్చిన ఫైళ్లను భద్రంగా స్టోర్‌ చేయడమెలాగో నేర్పిస్తున్నారు. ఈ ఆఫీస్‌ను అమలు చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేశామని, ఈ నెల 16 నుంచి అమలుకు సన్నద్ధంగా ఉన్నట్టు అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం ద్వారా ఉద్యోగులకు ఉన్న అనుమానాలు, సమస్యలను నివృత్తి చేసినట్టు తెలిపారు.

నిర్లక్ష్యానికి చెక్‌

ఈ-ఆఫీస్‌ ద్వారా ఫైళ్ల కదలికలో జాప్యాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ద్వారా స్వీయ ప్రయోజనాలను పొందేందుకు సిబ్బంది యత్నిస్తుంటారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను ముందుకు నడిపేందుకు కొన్ని కార్యాలయాల్లో లంచాలు డిమాండ్‌ చేస్తుంటారు. ఈ తరహా అడ్డగోలు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల నిర్ణీత సమయం కంటే ఎక్కడైనా ఫైల్‌ పెండింగ్‌ ఉంటే దానికి సదరు సిబ్బంది సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఫైల్‌ ఎక్కడ, ఎన్ని రోజులు పెండింగ్‌ ఉందన్న విషయం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసు కునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో పేపర్‌లెస్‌ పాలన వల్ల కార్యాలయాల్లో ఆర్థికపరమైన ఖర్చు తగ్గుతుంది. అంతిమంగా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పాలన అందించడంలో దోహదం చేస్తుంది.

Updated Date - Jan 08 , 2026 | 01:14 AM