Share News

పాఠశాలల్లో పర్యావరణ చైతన్యం

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:35 AM

జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ఉన్నత పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.

పాఠశాలల్లో పర్యావరణ చైతన్యం

రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో జీవో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

రీసైక్లింగ్‌కు పొడిచెత్త తరలింపు

తడి చెత్తతో కంపోస్టు తయారీ

ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌

తొలివిడత 114 పాఠశాలల్లో అమలు

ఒక్కో స్కూల్‌కు ఏటా రూ.2.17 లక్షల సగటు ఆదాయం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ఉన్నత పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్‌ కోసం సమీపంలోని స్వర్ణ సచివాలయానికి పంపిస్తారు. పొడిచెత్తను కంపోస్టుగా తయారు చేసి స్థానిక రైతులకు అందజేస్తారు. ఇందుకోసం ఆయా ఆశమ్ర పాఠశాలల్లో విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేశారు. జీరో వేస్ట్‌ నిర్వహణకు ఉపాధ్యాయులు మార్గదర్శులుగా నిలుస్తున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత ఏడాది డిసెంబరు 20న కశింకోట మండలం తాళ్లపాలెంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించిన సందర్భంగా పాఠశాలల్లో చెత్త నిర్వహణను మెరుగుపర్చాలని సూచించారు. దీంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచనల మేరకు విద్యా శాఖాధికారులు జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో చెత్త వ్యర్థాల నిర్వహణను వినూత్నంగా అమలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అనకాపల్లి జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘జీరో వేస్ట్‌’ విధానాన్ని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ విధానాన్ని మెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కలెక్టర్‌ను అభినందించడమే కాకుండా ఈ కార్యక్రమానికి ఏదైనా ఒక పేరును ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. దీంతో జిల్లాలో అమలు చేస్తున్న ‘జీరో వేస్ట్‌’ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.

పాఠశాలల్లో చెత్త నిర్వహణ ఇలా..

జిల్లాలో రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో వాడుక అనంతరం వృథాగా పోయే నీటిని హానికరం కాని నీరు, హానికరమైన నీరుగా ప్రత్యేక పద్ధతి ద్వారా విభజిస్తున్నారు. హానికరమైన నీటిని బయటకు పంపుతూ, హానికరం కాని నీటిని గార్డెన్‌కు, మొక్కలకు వినియోగిస్తున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్‌ కోసం సమీపంలోని స్వర్ణ సచివాలయానికి అందజేస్తున్నారు. తడి చెత్తను పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఒక గొయ్యి తవ్వి అందులో వేస్తారు. ఇది కంపోస్టుగా తయారైన తరువాత అదే గ్రామంలో రైతులకు అందజేస్తారు. జిల్లాలోని 114 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుకుంటున్న మొత్తం 24,776 మంది బాలబాలికలను జీవో వేస్ట్‌ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. ప్రతి విద్యార్థి నిర్దేశించిన సమయంలో చెత్త నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల నుంచి ప్రతి నెలా 57.1 టన్నుల తడిచెత్త, 24.5 టన్నుల పొడి చెత్త ఉద్భవిస్తుందని అంచనా వేశారు. ఈ చెత్త నిర్వహణ ద్వారా ప్రతి పాఠశాలకు సగటున నెలకు రూ.2.17 లక్షల ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో జీరో వేస్ట్‌ నిర్వహణలో మాకవరపాలెం, కె.కోటపాడు మండలం ఎ.కోడూరు, కశింకోట మండలం తాళ్లపాలెంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు/ వసతిగృహాలు ముందువరుసలో వున్నాయి.

మరింత సమర్థంగా..

గిడ్డి అప్పారావునాయుడు, డీఈఓ

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచనల మేరకు తొలి విడత జిల్లాలోని 114 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో జీరో వేస్ట్‌ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. కలెక్టర్‌ పలు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి పలు చూచనలు చేశారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో కిచెన్‌ గార్డెన్‌లు ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో పండించిన సేంద్రీయ కూరగాయలను విద్యార్థులకు వండి పెడుతున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 01:35 AM