కమ్మేసిన కాలుష్యం
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:22 AM
పండుగ రోజు నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగింది.
దీపావళి నాడు గణనీయంగా పెరిగిన వాయు, శబ్ద కాలుష్యం
సాధారణ రోజులతో పోల్చితే దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదు
పడిపోయిన గాలి నాణ్యత
జీవీఎంసీ కార్యాలయం వద్ద పీఎం 10 అత్యధికంగా 367...
పోలీస్ బ్యారెక్స్ వద్ద 331, జ్ఞానాపురంలో 313...
కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణ
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
పండుగ రోజు నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి పది, పదకొండు గంటల వరకూ ప్రజలు భారీగా బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు, కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి అనేక ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతూ వచ్చింది. టపాసుల మోతతో శబ్ద కాలుష్యం కూడా అదే స్థాయిలో ఉంది. ముఖ్యంగా వన్‌టౌన్, పూర్ణామార్కెట్, డాబాగార్డెన్స్, అల్లిపురం, ఆర్చే బీచ్‌రోడ్డు, జగదాంబ జంక్షన్, జ్ఞానాపురం, అక్కయ్యపాలెం, కంచరపాలెం, మద్దిలపాలెం, రైల్వే కాలనీ, మధురవాడ, గోపాలపట్నం, తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున టపాసాలు కాల్చడంతో పొగ నగరాన్ని కమ్మేసింది. దీపావళి రోజున గాలి నాణ్యతకు సంబంధించి మాన్యువల్, నేషనల్ యాంబియంట్ ఎయిర్‌క్వాలిటీ మానటరింగ్ స్టేషన్లు, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంపై ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ మానటరింగ్ స్టేషన్ నుంచి సేకరించిన డేటాను కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించింది. గత వారంతో పోల్చి కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో వెల్లడించింది. నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో ముందు వారంతో పోలిస్తే కొన్నిచోట్ల రెట్టింపు, మరికొన్ని చోట్ల మూడు రెట్లు మేర కాలుష్యం పెరిగినట్టు కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది.
అత్యధికంగా పోలీస్ బ్యారెక్స్‌లో నమోదు
సాధారణంగా పీఎం (పార్టిక్యూలేట్ మ్యాటర్/గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు) 10 (10 మైక్రోమీటర్లు అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన కాలుష్య కణాలు) సగటున 100 వరకు ఉండాలి. పీఎం 2.5 (అతి సూక్ష్మ ధూళి కణాలు) 60లోపు ఉండాలి. కానీ దీపావళి రోజున పీఎం 10...జీవీఎంసీ కార్యాలయం వద్ద ఏకంగా 367, పోలీస్ బ్యారెక్స్ వద్ద 331గా నమోదైంది. అలాగే జ్ఞానాపురంలో 313, మిందిలో 285, పెదగంట్యాడలో 278గా నమోదైంది. అదేవిధంగా పీఎం 2.5...అత్యధికంగా జీవీఎంసీ కార్యాలయం వద్ద 252, పోలీస్ బ్యారెక్స్ వద్ద 211, పెదగంట్యాడలో 191, మిందిలో 162గా నమోదైంది.
ప్రాంతం పీఎం 10 పీఎం-2.5 పీఎం-10 పీఎం-2.5
(గడిచిన ఆదివారం) (దీపావళి రోజు)
మింది 71 30 285 162
ఆటోనగర్ 54 23 232 156
పోలీస్ బ్యారెక్స్ 62 26 331 211
ఈఎ్‌సఐ హాస్పిటల్ 81 38 213 180 సీతమ్మధార 39 16 256 159
జ్ఞానాపురం 42 12 313 186
పెదగంట్యాడ 47 18 278 191
రాంకీ 49 21 166 101
ఎం.వి.పి. రైతుబజార్ 46 23 157 97
జీవీఎంసీ కార్యాలయం 54 23 367 252
సగటు విలువ 37 18 152 73