87 శాతానికి చేరిన ఎన్యుమరేషన్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:49 AM
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)కు మరో రెండురోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆదివారం సెలవుదినమైనా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు .
17,64,781 ఫారాల డిజిటిలైజేషన్
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)కు మరో రెండురోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆదివారం సెలవుదినమైనా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు .ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, బీఎల్‌వోలు క్యాంపుల్లో పాల్గొని సర్ ప్రక్రియను పరిశీలించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోలింగ్‌బూత్ నంబరు 89, 91, 92, 110,1 14లను డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఈఆర్వో ఎ.మధుసూదనరావు పరిశీలించారు. కాగా ఆదివారం సాయంత్రానికి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,23,009 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా తిరిగి ఓటర్ల నుంచి బీఎల్‌వోలకు చేరిన ఫారాల్లో 17,64,781 ఫారాలను డిజిటలైజేషన్ పూర్తిచేశారు.
జోరుగా క్రికెట్ బెట్టింగ్
సైబర్‌క్రైమ్ అదుపులో ముఠా
ఇండియా-ఇంగ్లండ్ టీ-20 సీరిస్‌లో భారీగా బెట్టింగ్
పక్కా సమాచారంలో టాస్క్‌ఫోర్స్ దాడి
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
నగరంలో క్రికెట్ బెట్టింగ్ జోరందుకుంటోంది. పోలీసులు పలుమార్లు దాడిచేసి అరెస్టులు చేస్తున్నా గుట్టుగా వ్యవహారం నడుస్తోంది. ఇండియా-ఇంగ్లండ్ టీ-20 సీరిస్‌లో భాగంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను తాజాగా సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాధవధార ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్‌లో కొంతమంది బిల్డర్లు, వ్యాపారాలు నిర్వహిస్తున్న యువకులు పెద్దఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైమ్ పోలీసులు సంయుక్తంగా అపార్టుమెంట్‌పై దాడిచేశారు. ఆ సమయంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులతోపాటు బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ర్టానిక్ సామగ్రితో పాటు బ్యాంక్‌లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ-20 మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. చివరిదైన ఐదో మ్యాచ్ శనివారం రాత్రి నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు పెద్దఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో సైబర్‌క్రైమ్ పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడిచేశారు. ఈ సమయంలో పలువురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆదివారం నాటికి ఇద్దరిని మాత్రమే సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి మిగిలినవారిని వదిలేశారని కొందరు ఆరోపిస్తున్నారు. పోలీసులకు పట్టుబడినవారిలో ఆర్థికంగా పలుకుబడివున్నవారు ఉన్నారని, వారు ఒత్తిడి చేయడంతోనే పోలీసులు ఇద్దరిని మినహా మిగిలినవారిని విడిచిపెట్టేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులను సంప్రదించగా నిందితులను సైబర్‌క్రైమ్ పోలీసులకు అప్పగించామని చెబుతున్నారు. సైబర్‌క్రైమ్ పోలీసులను వివరాలు కోరితే కేవలం ఇద్దరిని మాత్రమే అప్పగించారని, పూర్తివివరాలను రాబట్టాల్సి ఉందని చెబుతుండడం గమనార్హం.
రేపు నగరానికి మాజీ సీఎం జగన్
గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి వస్తారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లైంతైన ఆరుగురు మత్సకారుల కుటుంబాలతోపాటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కారె చిన్నను పరామర్శిస్తారన్నారు. సమావేశంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.