పాతుకుపోయిన పోలీస్
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:48 AM
జిల్లా పోలీసు శాఖలో కొందరు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే పోలీస్ స్టేషన్‌లో తిష్ఠ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సి’ నంబర్ కేటగిరీ వైద్యపత్రాలను సమర్పిస్తూ, బదిలీల నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఇటువంటి వారి వ్యవహారశైలిపై పోలీసు శాఖలో చర్చ జరుగుతున్నది.
అనారోగ్యం సాకుతో ఏళ్లతరబడి ఒకే స్టేషన్‌లో తిష్ఠ
సాధారణ బదిలీల నుంచి మినహాయింపు
స్టేషన్లలో చక్రం తిప్పుతున్న ‘సి’ నంబర్ పోలీసులు
పట్టించుకోని ఉన్నతాధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లా పోలీసు శాఖలో కొందరు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే పోలీస్ స్టేషన్‌లో తిష్ఠ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సి’ నంబర్ కేటగిరీ వైద్యపత్రాలను సమర్పిస్తూ, బదిలీల నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఇటువంటి వారి వ్యవహారశైలిపై పోలీసు శాఖలో చర్చ జరుగుతున్నది.
దీర్ఘకాలిక అనారోగ్యం, శస్త్రచికిత్స అనంతరం ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి రావడం, ఇతర తీవ్రమైన వైద్య కారణాల వల్ల పోలీసు శాఖలో ‘సి’ నంబర్ పేరుతో సాధారణ బదిలీల నుంచి తాత్కాలిక మినహాయింపు పొందుతుంటారు. మెడికల్ బోర్డు లేదా సంబంధిత అధికారుల సిఫారసుల ఆధారంగా ఈ వెసులుబాటు కల్పిస్తారు. వీరిని అసెస్‌మెంట్ సర్వెంట్స్‌గా పిలుస్తారు. అయితే ఈ సౌకరాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కొంతమంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు అనారోగ్య కారణాలతో చాలా ఏళ్ల నుంచి ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ నంబర్‌తో సుమారు 35 మంది విధుల్లో కొనసాగుతున్నట్టు రికార్డులనుబట్టి తెలుస్తున్నది. జిల్లా కేంద్రంలోని ఒక పోలీసు స్టేషన్‌లో నలుగురు కానిస్టేబుళ్లు అనారోగ్య కారణాలతో ఐదేళ్లకుపైబడి పాతుకుపోయారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఏఎస్‌ఐ స్టేషన్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టు తోటి పోలీసులే ఆరోపిస్తున్నారు. సాధారణంగా అనారోగ్య కారణాలతో ‘సి’ నంబర్ కింద పనిచేసే పోలీసులు.. కేవలం కార్యాలయ విధులకే పరిమితం అవుతుంటారు. కానీ జిల్లా కేంద్రంలోని సదరు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ.. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే తిష్ఠవేశారంటే అతని పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క పోలీస్ స్టేషన్‌లోనే కాదు.. నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి, కశింకోట పోలీస్ స్టేషన్లలో కూడాఅనారోగ్య సమస్యలతో ‘సి’ నంబర్ కింద ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు వున్నారు.
‘సి’ నంబర్ ఉద్యోగులపై ఆరోపణలు
పలు పోలీసు స్టేషన్‌లలో ‘సి’ నంబర్‌తో పనిచేస్తున్న కొంతమంది పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైటర్లుగా విధులు నిర్వహిస్తున్న కొందరు హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు స్థానిక పరిచయాలను ఆసరాగా చేసుకొని పలు వ్యవహారాల్లో తలదూర్చి పంచాయితీలు నిర్వహిస్తున్నారు. వివిధ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులకు కేసులు కట్టకుండా, బాధితులు- నిందితుల మధ్య రాజీ కుదురుస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారి గురించి ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహిస్తున్న వారికి న్యాయం చేయడంతోపాటు, వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్న వారిని గుర్తించడం కూడా అధికారుల బాధ్యత అని అంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ బృందంతో అన్ని పోలీసు స్టేషన్‌లలో అనారోగ్య కారణాలతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిబ్బంది వివరాలను సేకరించి, వారి వైద్య రికార్డులు, విధుల కాలపరిమితి, బదిలీల చరిత్రపై సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.