ఒక్ పూట భోజనంతో సరి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:08 PM
అన్న క్యాంటీన్.. పేదల పాలిట వరం. ఈ క్యాంటీన్ ఆరు నెలల క్రితం అరకులోయలో అందుబాటులోకి వచ్చింది.
పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని అన్న క్యాంటీన్
రోజూ విశాఖపట్నం నుంచి భోజనం రావలసి ఉండడంతో ఇబ్బందులు
అరకులోయ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్.. పేదల పాలిట వరం. ఈ క్యాంటీన్ ఆరు నెలల క్రితం అరకులోయలో అందుబాటులోకి వచ్చింది. రుచికరమైన, నాణ్యమైన భోజనం రూ.5లకే దొరుకుతుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఇక్కడ రోజులో కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం దొరుకుతోంది. రోజూ విశాఖపట్నం నుంచి భోజనం రావలసి ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
పాడేరు, అరకులోయ పట్టణాల్లో ఆరు నెలల క్రితం అన్న క్యాంటీన్లు ప్రారంభంకాగా, ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం లభిస్తోంది. వాస్తవానికి క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించాల్సి ఉంది. పేదలు మూడు పూటలా తింటే రోజుకు కేవలం రూ.15లే ఖర్చు అవుతుంది. అయితే రోజూ విశాఖపట్నం నుంచి భోజనం పాడేరు, అరకులోయ అన్న క్యాంటీన్లకు వస్తుంది. అందువల్లే కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం అందించగలుగుతున్నారు. అయినా సరే అరకులోయ క్యాంటీన్‌లో రోజూ 300 మంది భోజనాలు చేస్తున్నారు. శుక్రవారం వారపు సంత రోజున 450 నుంచి 500 మంది వరకు భోజనాలు చేస్తున్నారు. భోజనం రుచికరంగా ఉండడంతో పర్యాటకులు, వ్యాపారులు సైతం ఇక్కడికి వస్తుంటారు.
వంటశాలకు స్థలం కేటాయిస్తేనే సమస్య పరిష్కారం
పాడేరు, అరకులోయలోని అన్న క్యాంటీన్లకు మూడు పూటలా ఆహారం అందించాలంటే స్థానికంగానే వంటశాల ఉండాలి. అందుకు క్యాంటీన్ నిర్వాహకులు స్థలం కోసం ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వంటశాల ఏర్పాటుకు స్థలం లేదా భవనాన్ని కేటాయిస్తే ఇక్కడ నుంచే పాడేరు, అరకులోయ క్యాంటీన్లకు ఆహారం అందించగలుగుతామని పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో పూర్తిస్థాయిలో అన్న క్యాంటీన్ అందుబాటులోకి రాలేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.