బ్లూ ప్రింట్‌కు భిన్నంగా ఇంగ్లిష్ ప్రశ్న పత్రం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:19 AM
పదో తరగతి ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రం విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది.
టెన్త్ విద్యార్థుల్లో గందరగోళం
ప్రతి విద్యార్థికి 15 మార్కులు కలిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్న ఉపాధ్యాయులు
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రం విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. గురువారం పరీక్ష రాసిన విద్యార్థులు తమ తమ పాఠశాలల్లో ఆంగ్ల ఉపాధ్యాయుల దృష్టికి ప్రశ్నపత్రంలో ఇబ్బందులకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రం పరిశీలించి పలు తప్పులను గుర్తించారు. ఏటా ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికకు సంబంధించి బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. దీని ప్రకారమే విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతారు. అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు బ్లూప్రింట్ మేరకు తయారుచేయాలి. కానీ ఇంగ్లీషు ప్రశ్నపత్రం బ్లూప్రింట్‌ను ఉల్లంఘించి రూపొందించారని పలువురు టీచర్లు, విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. సిలబస్‌కు భిన్నంగా ఇచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు రాయలేకపోయారు. ప్రశ్న సంఖ్య 17లో ఐదు మార్కులకు ఒక ప్రశ్న ఇచ్చారు. జంబ్లింగ్‌లో ఇచ్చిన పదాలను సరిచేయాలనే దానికి ఇచ్చిన నాలుగు జవాబులలో రెండు ఒకేలా ఉన్నాయి. దీంతో ఒక్కొక్క విద్యార్థి ఒక్కో రకంగా రాశారు. పరీక్షల మూల్యాంకనంలో జవాబుపత్రాలను దిద్దేటప్పుడు నిర్దేశించిన జవాబుకు మార్కులు వేయాలని సూచించినట్టయితే కొందరు విద్యార్థులు నష్టపోతారని పలువురు టీచర్లు వ్యాఖ్యానించారు. అలాగే పది మార్కులకు ఇచ్చిన ప్రశ్న నంబర్లు 18, 22, 25, 28, 31, 32...బ్లూప్రింట్‌కు భిన్నంగా సిలబస్‌లో లేనివని గుర్తించారు. ఎక్కువమంది విద్యార్థులు ప్రశ్నలకు జవాబు రాయలేదని, కొందరు తప్పు జవాబులు రాసి ఉంటారని అంచనా వేశారు. ప్రశ్న 17, ఇంకా సిలబస్‌లో లేని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయానని పెందుర్తి ప్రాంతానికి చెందిన విద్యార్థి ఒకరు వాపోయారు. ఆంగ్లంలో 15 మార్కులు తగ్గే అవకావం ఉందని ఆందోళన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి 15 మార్కులు కలిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆంగ్ల ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు ఆలస్యం
అనుబంధ కళాశాలల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వ్యవస్థ
ఏర్పాటుకు ఏయూ నిర్ణయం
విశ్వవిద్యాలయాలను తాజాగా కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో చేర్చిన ప్రభుత్వం
ఇప్పుడు ఆ బాధ్యత చేపట్టిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్’
నోడల్ అధికారులను నియమించాలంటూ ఆదేశాలు
ప్రత్యేకంగా యాప్ తీసుకురానున్న అధికారులు
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్-ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు కాస్త ఆలస్యం కానున్నది. ఈ నెలాఖరు నాటికి సుమారు వంద కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని, అందుకు అవసరమైన బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లను ఆహ్వానించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అయితే, ఉన్నతస్థాయిలో జరిగిన మార్పుల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో భాగం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు దృష్టిసారించారు. దీంతో ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియను విశ్వవిద్యాలయ అధికారులు నిలిపివేశారు. తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు వర్సిటీలో, ఆయా కాలేజీల్లో నోడల్ అధికారులను నియమించాలి. ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారిత హాజరును నోడల్ అధికారులు ట్రాకింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రిన్సిపాల్స్, డిపార్టుమెంట్ హెడ్స్ ఈ వ్యవస్థ అమలును పర్యవేక్షించాలి. ఈ మేరకు వర్సిటీలు, కాలేజీలు నోడల్ అధికారి రిజిస్ర్టేషన్ ప్రక్రియను గత నెలాఖరు నాటికి పూర్తిచేయాలని అధికారులు స్పష్టంచేశారు. అయితే, ఇప్పటివరకు కొన్ని కాలేజీలు మాత్రమే నోడల్ అధికారులను నియమించినట్టు చెబుతున్నారు. ఏయూ పరిఽధిలో 300కుపైగా డిగ్రీ, పీజీ, బీఈడీ, లా కళాశాలలు ఉన్నాయి. తొలిదశలో వంద కాలేజీల్లో బయోమెట్రిక్ అమలు చేసేందుకు పరికరాలను ఏర్పాటుచేయాలని అధికారులు భావించారు. అయితే ప్రత్యేకంగా యాప్ ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మెషీన్లు కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఏడు ట్రావెల్స్ బస్సులపై కేసులు
మురళీనగర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
రవాణా శాఖ అధికారులు గురు, శుక్రవారాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఏడు బస్సుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. రూ.55 వేలు జరిమానా విధించినట్టు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అనుమతులు లేకపోవడం, పర్మిట్ నిబంధనలను దాటి వాహనాలు నడపడం, పన్నుల ఎగవేత, అత్యవసర ద్వారాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. దాడులు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.