నష్టాల అంచనాలో నిమగ్నం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:59 AM
భారీవర్షాల వల్ల వాటిల్లిన నష్టాన్ని లెక్కించే పనిలో అన్ని ప్రభుత్వ శాఖలూ నిమగ్నమయ్యాయి.
పొటోలు : పంచాయతీ పోల్డర్‌లో ఉన్నాయి
రైటప్: పెందుర్తిమండలం రాజయ్యపేటలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్
నష్టాల అంచనాలో నిమగ్నం
ఆర్ అండ్ బి పరిధిలో
11.5 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నట్టు అధికారుల వెల్లడి
తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు,
పునర్నిర్మాణానికి రూ.5.6 కోట్లు అవసరం
పంచాయతీ శాఖకు రూ.40 లక్షల నష్టం
పలుచోట్ల కూలిన పాఠశాలల్ల ప్రహరీ గోడలు
జీవీఎంసీ పరిధిలో పలు రహదారులు ధ్వంసం
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
భారీవర్షాల వల్ల వాటిల్లిన నష్టాన్ని లెక్కించే పనిలో అన్ని ప్రభుత్వ శాఖలూ నిమగ్నమయ్యాయి. కొన్ని శాఖలు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేయగా, మరికొన్ని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు రప్పించుకుంటున్నాయి. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో మొత్తం 11.5 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. పాడైన రోడ్లను తాత్కాలికంగా మరమ్మ చేసేందుకు రూ.35 లక్షలు అవసరమని ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదించారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి రూ.5.6 కోట్లు అవసరమని పేర్కొన్నారు. వరద నీరు పోటెత్తడంతో పెందుర్తి మండలం రాజయ్యపేటలో సిమెంట్ రోడ్డు ధ్వంసమైంది. ఇదే మండలం ఎస్.ఆర్.పురంలోని ఎన్టీఆర్ కాలనీలో కల్వర్టు కొట్టుకుపోయింది.
పంచాయతీ శాఖకు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలో సుమారు 13 పాఠశాలల ప్రహరీగోడలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా కూలిపోయాయి. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో ప్రహరీగోడ, ఒక భవనం సీలింగ్, ఆనందపురం పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి సుమారు రూ.28 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. మిగిలిన పాఠశాలల ప్రహరీ గోడల మరమ్మతుకు ఎంత నిధులు అవసరం అన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.
అదేవిధంగా భారీవర్షాలకు జిల్లాలో ఏడు ఇళ్లు పూర్తిగా, మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక సబ్‌స్టేషన్, 36 ఫీడర్లు, 181 విద్యుత్‌స్తంభాలు దెబ్బతినగా 28,934 విద్యుత్ సర్వీస్‌లపై ప్రభావం పడింది. ఉద్యానవన పంటలకు సంబంధించి భీమునిపట్నం, ఆనందపురం మండలాల్లో 34 మంది రైతులకు చెందిన 9 హెక్టార్లలో అరటి, 0.4 హెక్టార్లలో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో పశువుల పాక దెబ్బతినగా, మూడు ప్రాంతాల్లో మూడు పశువులు మృతిచెందాయి. వర్షాల కారణంగా 97 కుటుంబాలకు చెందిన 257 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. జీవీఎంసీ అధికారులు నష్టాలపై అంచనాలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
భారీవర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అన్నారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన 55 ఫిర్యాదులు పరిష్కరించామని, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్‌కు వచ్చిన 179 ఫిర్యాదుల్లో 163 పరిష్కరించామని, మిగిలిన వాటికి సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. నాలుగు రోజుల్లో జిల్లాలో 332.7 మి.మీ. వర్షపాతం కురిసిందన్నారు. గంభీరం రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి...126 అడుగులకు చేరుకుందన్నారు. ప్రస్తుతం 100 క్యూసెక్కుల నీరు వస్తోందని, మిగులు నీటిని దిగువకు విడిచిపెడుతున్నామన్నారు. అలాగే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి 56 అడుగులు కాగా ప్రస్తుతం 52.8 అడుగులకు చేరుకుందన్నారు.
మేహాద్రిగెడ్డకు జలకళ
వర్షాలతో భారీగా ఇన్‌ఫ్లో
నీటి మట్టం 52.5 అడుగులకు చేరిక
గోపాలపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. రిజర్వాయర్ కనిష్ఠ నీటిమట్టం 44 అడుగులు, గరిష్ఠం 61 అడుగులు. మూడు రోజుల క్రితం నీటి మట్టం 47 అడుగులు ఉండగా, శుక్రవారం ఉదయానికి 52.5 అడుగులకు చేరింది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నీటి మట్టం ఈ నెల ప్రారంభంలో 46 అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్ నుంచి రోజుకు 8 నుంచి 12 ఎంజీడీల నీటిని నగర వాసుల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ప్రస్తుత వర్షాలు లేకుంటే నెలాఖరు నాటికి రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అయ్యేది. ఇటువంటి తరుణంలో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు రిజర్వాయర్ నీటిమట్టం ఒక్కసారిగా ఏడు అడుగులు పెరిగింది. ఇదే నీటి మట్టం కొనసాగితే మరొక నాలుగైదు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది ఉండదని రిజర్వాయర్ సిబ్బంది చెబుతున్నారు.
రహదారులు ఛిద్రం
వర్షాలతో ఎక్కడికక్కడే గోతులు...
జాతీయ రహదారిపై కూడా...
చూసుకోకుండా ప్రమాదాలే
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో అనేక రహదారులు ఛిన్నాభిన్నమయ్యాయి. ఎక్కడికక్కడే గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. జాతీయ రహదారిని ఆధునికీకరించి ఇంకా ఏడాది పూర్తికాక ముందే ఈ వర్షాలకు గోతులమయమైంది. సత్యం జంక్షన్ నుంచి హనుమంతవాక వరకు పదుల సంఖ్యలో గోతులు ఉన్నాయి. ఆరిలోవ నుంచి ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రి మీదుగా విమ్స్ వైపు వెళ్లే మార్గంలో మలుపు వద్ద రహదారిని నాలుగు నెలల క్రితమే విస్తరించారు. ఆ ప్రాంతం వర్షపు నీటికి కుంగిపోయింది. దానిపై సిమెంట్ బుగ్గి తీసుకువచ్చి పోశారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వాహనాలన్నీ అందులో కూరుకుపోతున్నాయి. ఇప్పుడైనా పూర్తిస్థాయిలో దానిని సరిచేయాల్సి ఉంది. అలాగే డాబాగార్డెన్స్ నుంచి జగదాంబ సెంటర్‌కు వెళ్లే మార్గంలో కూడా గోతులు పడ్డాయి. కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లే మార్గం మొత్తం గోతులు పడింది. పైగా అక్కడ టోల్‌గేట్ ఫీజు కింద ఒక వైపునకు రూ.49 వసూలు చేస్తున్నారు. సరైనా మార్గం వేయకుండా ఫీజులు వసూలు చేయడంపై వాహనచోదకులు తిరగబడుతున్నారు. తాటిచెట్లపాలెం నుంచి కంచరపాలెం మెట్టుకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది. ఇక శివారు ప్రాంతాల్లో ఒక్క మధురవాడ ఏరియాలోనే 12 కి.మీ. మేర రహదారులు పాడైనట్టు అధికారులు లెక్కలు తేల్చారు. గోపాలపట్నం-పెందుర్తి, షీలానగర్-గాజువాక రహదారులు కూడా దెబ్బతిన్నాయి. అఽధికారులు వీటిని సకాలంలో పూడ్చకపోతే ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
వ్యవసాయానికి ఊపిరి
ఇప్పటివరకూ వేసిన వరి నాట్లకు ఢోకా ఉండదంటున్న రైతులు
రబీలో 2,000 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళిక
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు జిల్లాలో ఖరీఫ్ పంటలకు ప్రాణం పోశాయి. ఈ ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో నాలుగు గ్రామీణ మండలాల్లో సాగు సజావుగా సాగలేదు. సీజన్‌లో 4,800 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, బోరు నీటి సదుపాయం కలిగిన 2,500 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. నీరు చాలక అవి కూడా కొన్నిచోట్ల ఎండిపోయాయి. ఈ దశలో ఈనెల 21వ తేదీ నుంచి కురిసిన వర్షాలతో జిల్లాలో గల 524 చెరువుల్లో సుమారు 40 శాతం నీరు చేరింది. గోస్తనీ నదికి వరద రావడంతో పరీవాహక ప్రాంతంలో గల పొలాలకు నీరు అందనున్నది. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లు నుంచి పూర్తిస్థాయిలో నీరు వస్తోంది. దీంతో ఇప్పటివరకూ వేసిన వరి నాట్లకు ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇంకా మిగిలిన పొలాల్లో నాట్లు వేసేందుకు కొన్నిచోట్ల రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఖరీఫ్‌కంటే రబీలో సాగుపై రైతులు దృష్టిసారించాలని వ్యవసాయ శాఖ సూచించింది. రబీలో సుమారు 1,100 హెక్టార్లలో వరి, 600 హెక్టార్లలో రాగులు, 300 హెక్టార్లలో మొక్కజొన్న సాగుకు అవసరమైన ప్రణాళిక రూపొందించింది. మరో 300 హెక్టార్లలో అపరాలు సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. కాగా ప్రస్తుతం కురిసిన వర్షాలతో పైరుకు అవసరమైన యూరియా సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు.