తాటిగుడ జలపాతంపై అంతులేని నిర్లక్ష్యం!
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:46 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిగుడ జలపాతం వద్ద నిర్వహణ లోపం పర్యాటకులకు శాపంగా మారింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరుత్సాహానికి గురవుతున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం రూ.30 లక్షలతో అభివృద్ధి చేసిన పర్యాటక శాఖ
నాటి నుంచి నిర్వహణను పట్టించుకోని వైనం
ఊడిపోతున్న వ్యూపాయింట్ రెయిలింగ్
పిచ్చిమొక్కలు దట్టంగా పెరగడంతో ఇబ్బంది పడుతున్న పర్యాటకులు
అనంతగిరి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిగుడ జలపాతం వద్ద నిర్వహణ లోపం పర్యాటకులకు శాపంగా మారింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరుత్సాహానికి గురవుతున్నారు.
తాటిగుడ జలపాతం వద్ద గతంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. అయితే తొమ్మిదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ అధికారులు రూ.30 లక్షలతో ఇక్కడ సదుపాయాలు కల్పించారు. జలపాతాన్ని ఆనుకుని వ్యూపాయింట్ నిర్మించి, పర్యాటకుల సౌకర్యార్థం మినీ రెస్టారెంట్, స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు రెండు రూమ్‌లు, అలాగే జలపాతం వద్దకు వెళ్లేందుకు మెట్లను నిర్మించారు. అంతా బాగానే ఉన్నా నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. పిచ్చిమొక్కలు దట్టంగా పెరగడంతో మినీ రెస్టారెంట్ వద్దకు, దుస్తులు మార్చుకునే గదుల వద్దకు వెళ్లడానికి అవకాశం లేకుండా ఉంది. పైగా విష కీటకాలు ఉంటాయేమోనని పర్యాటకులు భయపడుతున్నారు. అలాగే మెట్ల పైనుంచి నీరు పారుతుండడంతో కొంత వరకు నాచుపట్టి ప్రమాదభరితంగా మారింది. మెట్లను ఆనుకుని ఉన్న ఇనుప రెయిలింగ్ వద్ద ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాములు ఉన్నాయేమోనని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఎత్తైన ప్రదేశంలో పంట పొలాను ఆనుకుని నిర్మించిన వ్యూపాయింట్ వద్ద ఉన్న స్టిల్ రెయిలింగ్ ఉడిపోతుండడంతో పర్యాటకులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికైనా పర్యాటకశాఖ అధికారులు స్పందించి ఇక్కడ సౌకర్యాలను కల్పించడంతో పాటు సక్రమంగా నిర్వహణ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.