నీటి పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:33 PM
గ్రామీణ నీటి సరఫరాల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నీటి నాణ్యత నిర్వహణ పరీక్షా కేంద్రాలు మొక్కుబడిగా సేవలందిస్తున్నాయి.
మొక్కుబడిగా కేంద్రాల సేవలు
రికార్డుల్లో మాత్రం లక్ష్యాలను సాధించినట్టు నమోదు
క్షేత్రస్థాయికి అందని నీటి పరీక్షల ఫలితాలు
కలుషిత నీటితో ప్రబలుతున్న వ్యాధులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
గ్రామీణ నీటి సరఫరాల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నీటి నాణ్యత నిర్వహణ పరీక్షా కేంద్రాలు మొక్కుబడిగా సేవలందిస్తున్నాయి. రికార్డుల్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసినట్టు చూపిస్తున్నా క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలో 645 పంచాయతీలు, 1,435 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి పథకాలు 27, పీడబ్ల్యూఎస్ స్కీమ్‌లు 1,850 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రక్షిత నీరు అందించే బాధ్యత గ్రామ పంచాయతీలపై ఉంటుంది. జిల్లాలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు అనకాపల్లి, సబ్బవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలిలో గ్రామీణ నీటి సరఫరాల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో నీటి నాణ్యత నిర్వహణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయా కేంద్రాల్లో ప్రతి నెలా కనీసం 250 నుంచి 300 నీటి నమూనాలు సేకరించి నీటి నాణ్యత పరీక్షలు చేయాలి. ఎక్కడైనా నీటి నాణ్యత లోపించినట్టయితే అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఈ పరీక్షా కేంద్రాల ద్వారా సూచనలు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి పంచాయతీ పరిధిలో కూడా స్థానికంగా నీటి నాణ్యత పరీక్షించేందుకు క్లోరినేషన్ కిట్లు అందజేశారు. వీటి వినియోగంపై అంగన్‌వాడీలు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. కొద్ది కాలానికే ఆయా కిట్లు మూలకు చేరాయి.
కొరవడిన శాఖల మధ్య సమన్వయం
ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నీటి పరీక్షా కేంద్రాలలో నమూనాల ఫలితాలు ప్రజలకు చేరడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నారు. నీటి పరీక్షా కేంద్రాలలో ప్రజారోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియా నిర్మూలనకు క్లోరినేషన్ చేస్తారు. అయితే చాలా గ్రామాల్లో ఇది జరగడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో బోర్లు, తాగునీటి బావులు, నీటి ట్యాంకుల నుంచి నీటి నమూనాలు సేకరించి నీటి పరీక్షా కేంద్రాలకు పంపాల్సి ఉంటంది. కేంద్రాల్లో పరీక్షల అనంతరం వాటి ఫలితాలను గ్రామ పంచాయతీలకు చేరవేసి, కలుషిత నీటి వనరుల్లో క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యత తమది కాదంటే తమది కాదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రధానంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీటి పరీక్షా కేంద్రాల పని తీరు మొక్కుబడిగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన నీటి నమూనాలు కేంద్రాలకు చేరుతున్నా, వాటి ఫలితాలు మాత్రం ప్రజలకు అందడం లేదు. నీటి పరీక్షా కేంద్రాల్లోని నీటి నమూనాలను పరీక్షలు చేసి, సాంద్రతను బట్టి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా, ఆ విధంగా జరగడం లేదు. అన్ని మండలాల నుంచి నీటి పరీక్షా కేంద్రాలకు నీటి నమూనాలు రావడం లేదు. కొన్ని మండలాల నుంచి మొక్కుబడిగా సేకరించి వాటిని పరీక్షలు జరిపినట్లు రికార్డుల్లో చూపిస్తూ, సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నీటి పరీక్షలపై గ్రామాల్లో ప్రధానంగా ఆరోగ్య సిబ్బంది దృష్టి సారించాల్సి ఉన్నా, వారు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పంచాయతీ కార్మికులు అప్పుడప్పుడు నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయకుండా పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీని కారణంగా నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాలో నాతవరం, గొలుగొండ, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో కలుషిత నీరు కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండగా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధికారులు తమ ఆధీనంలో ఉన్న నీటి పరీక్షా కేంద్రాలలో ఏ నెలలో ఎన్ని నీటి పరీక్షలు చేశారు?, ఎటువంటి చర్యలు చేపట్టారనే దానిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నీటి పరీక్షా కేంద్రాల్లో నీటి పరీక్షా ఫలితాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.