పర్యాటకంపై అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:49 AM
ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక ప్రత్యేకత, సుందరమైన సముద్ర తీర ప్రాంతాలు... ఇలా పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రమణీయ ప్రదేశాలు జిల్లాలో ఉన్నా వాటి అభివృద్ధిపై మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోంది.
- అటకెక్కిన టూరిజం సర్క్యూట్ ప్రతిపాదన
- జిల్లాలో రమణీయ, చారిత్రక ప్రదేశాలు ఉన్నా పట్టించుకోని వైనం
- కేవలం ప్రకటనలే తప్ప అభివృద్ధి జాడ లేదని విమర్శలు
- నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా...
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక ప్రత్యేకత, సుందరమైన సముద్ర తీర ప్రాంతాలు... ఇలా పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రమణీయ ప్రదేశాలు జిల్లాలో ఉన్నా వాటి అభివృద్ధిపై మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోంది. పర్యాటకంపై ప్రకటనలు, ప్రణాళికలు తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
జిల్లాలోని బొజ్జన్నకొండ, దేవీపురం, అలాగే సీతపాలెం, తంతడి తీర ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ఏటా పాలకులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. టూరిజం సర్క్యూట్ ఏర్పాటుతో జిల్లాకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాల్సి ఉండగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించినప్పటికీ వాటికి అవసరమైన ప్రాథమిక సదుపాయాల కల్పనలోనూ జాప్యం నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధికి నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో పనులు ముందుకు సాగడం లేదు.
తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కరువు
జిల్లాలో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన దాదాపు అటకెక్కింది. సీతపాలెం, తంతడి, తిక్కవానిపాలెం, రేవుపోలవరం, పూడిమడక సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం మరుగుదొడ్లు, తాగునీరు, వీధి దీపాలు, పార్కింగ్, భద్రత, తినుబండారాల కేంద్రాలు, వసతి వంటి సదుపాయాలు అవసరం. ఇవి లేకపోవడంతో పర్యాటకులు కొద్దిసేపు సందర్శించి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలోని సీతపాలెంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. ఇక్కడ ప్రకృతి అందాలకు వన్నెతెచ్చి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించినా నేటికీ అమలు జరగలేదు. సులభమైన రవాణా, పారిశుధ్యం, విద్యుత్, రక్షణ, వసతి, ఆహారం, పార్కింగ్, సమాచార వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పించాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోకపోవడంతో అభివృద్ధికి దూరంగానే వుంది.
బొజ్జన్నకొండపై చిన్నచూపు
జిల్లా కేంద్రం అనకాపల్లికి సమీపంలో ఉన్న బొజ్జన్నకొండ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కీలకమైన బౌద్ధ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందింది. నాలుగో శతాబ్దం నుంచి తొమ్మిదో శతాబ్దం మధ్య కాలానికి చెందిన బౌద్ధ అవశేషాలు ఇక్కడ ఉన్నాయని చరిత్ర చెబుతోంది. చారిత్రాత్మక ప్రాంతంగా గుర్తింపు ఉన్న ఈ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో దశాబ్ద కాలం కిందట రూ.7 కోట్ల అంచనాలతో బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన చేసినా ఇప్పటికీ అమలుకాలేదు. సందర్శకులకు చారిత్రక నేపథ్యాన్ని వివరించే సమాచార కేంద్రాలు, గైడ్ సేవలు, పార్కింగ్, పరిశుభ్రత, తాగునీరు, మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉండగా, రూ.2 కోట్ల వ్యయంతో ఒక ఎమినిటీ సెంటర్ భవనాన్ని నిర్మించి వినియోగించకుండా వృథాగా వదిలేశారు. ఈ భవనంలో పర్యాటక శాఖ హరిత రిసార్ట్స్‌ను నిర్వహించాల్సి ఉండగా, భవనం ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా ద్వారాలు తెరుచుకోలేదు. ఎమినిటీ సెంటర్‌కు సమీపంలో రహదారి పక్కన ఒక బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కనీసం ఆలనాపాలన చూడకుండా గాలికొదిలేశారు. బొజ్జన్నకొండకు వెళ్లే రోడ్డుపై నుంచి నిత్యం క్వారీ లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు కూడా శిథిలావస్థకు చేరింది.
కొండకర్ల ఆవ అభివృద్ధి అంతంతే...
ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా కొండకర్ల ఆవకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ వందకు పైగా స్థానిక, విదేశీ వలస పక్షులు కనిపిస్తాయి. తాటిచెట్ల దుంగలతో స్థానికులు ప్రత్యేకంగా తయారు చేసిన బోట్లలో ప్రయాణించడం ఇక్కడ ప్రత్యేక అనుభూతి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొండకర్ల ఆవను రూ.40 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఆవ అభివృద్ధి పనులు అడుగు కదల్లేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక కొండకర్ల ఆవ పరిసరాల్లోనిప్రకృతి అందాలు, వలస పక్షులు, జీవవైవిధ్యానికి నిలయమైన ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కార్యాచరణ రూపొందించింది. ఇటీవల కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించేందుకు వీలుగా జలవనరుల శాఖ పలు షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) జారీ చేసింది. వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు ప్రాతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. విదేశీ వలస పక్షుల స్థావరాలను రక్షించడం, వేట, ఆక్రమణలను నిరోధించి, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. గత ఏడాది అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ఆవలో పర్యాటకుల కోసం అధునాతన లంగరు, ఫైబర్ బోట్లను ఏర్పాటు చేశారు. అయితే అంతకుమించి అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా బోటింగ్, జెట్టీ నిర్మాణం, రిసార్ట్స్, విశ్రాంతి గదులు, వాకింగ్ ట్రాక్‌లు, వ్యూపాయింట్లు ఏర్పాటు చేస్తేనే కొండకర్ల ఆవకు పర్యాటక శోభ వస్తుంది. జిల్లాలో పర్యాటకశాఖ ద్వారా అభివృద్ధి పనులు జరగకపోవడంపై పర్యాటక శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి మనోరమ వివరణ కోరగా, పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామన్నారు. కొండకర్ల ఆవ పరిసరాల్లో అటవీ శాఖ సౌజన్యంతో ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి జరగనున్నదని ఆమె తెలిపారు.