చెరువుపై అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:27 AM
మండలంలో వందలాది ఎకరాలకు సాగునీరందించే మాడగడ పంచాయతీ నందిగుడ చెరువు నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది.
పూడుకుపోయినా, చెక్‌డ్యాం దెబ్బతిని సాగునీరు వృథాగా పోతున్నా పట్టని వైనం
నాలుగు గ్రామాల రైతులకు తప్పని కష్టాలు
అరకులోయ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో వందలాది ఎకరాలకు సాగునీరందించే మాడగడ పంచాయతీ నందిగుడ చెరువు నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది. వాస్తవానికి ఈ చెరువు నుంచి నందిగుడ, చంపగుడ, గత్తరగుడ, కాగువలస గ్రామాలకు చెందిన 228.84 ఎకరాలకు సాగునీరు అందాలి. అయితే చెరువు పూడుకుపోవడం, చెక్‌డ్యాం దెబ్బతిని నీరు వృథాగా పోతుండడంతో నీరు అందడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.
నందిగుడ చెరువు చాలా వరకు పూడుకుపోయింది. చెరువు కింద ఉన్న చెక్‌డ్యాం, చెక్‌డ్యాం చానళ్లు దెబ్బతిన్నాయి. స్లూయీస్ గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటన్నింటినీ పూర్తి చేస్తే 228 ఎకరాలతో పాటు అదనంగా మరో 86 ఎకరాలకు నీరందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు తహశీల్దార్, ఆర్‌ఐ గత ఏడాది మే 8న సర్వే చేసి ఎస్‌ఎంఐ శాఖకు, కలెక్టర్, ఐటీడీఏ పీవోకు నివేదిక పంపారు. దీని ఆధారంగా పాడేరు ఎస్‌ఎంఐ ఈఈ సుమారు రూ.34 లక్షల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో గత నెలలో ఐదు రోజులపాటు చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. అనంతరం చెరువులో నీరు ఉందంటూ పనులు నిలిపివేశారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.