Share News

అప్పన్న ఆభరణాలపై అంతులేని నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:15 AM

సింహాచలం దేవస్థానంలో అక్రమార్కులపై చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

అప్పన్న ఆభరణాలపై అంతులేని నిర్లక్ష్యం

సింహాచలం దేవస్థానంలో బంగారు, వెండి వస్తువులు అదృశ్యమయ్యాయని ఏడాదిన్నర కిందట కడప జిల్లా వాసి ఫిర్యాదు

రెండు దఫాలుగా దేవదాయ శాఖ విచారణ

ఐదుగురితో కూడిన కమిటీ నివేదిక ఇచ్చి ఆరు నెలలైనా మౌనం

బాధ్యులపై చర్యలు శూన్యం

అందులో ముగ్గురు...త్వరలో పదవీ విరమణ

అందుకే తాత్సారం

బహిరంగ విచారణకు ఫిర్యాదీ డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానంలో అక్రమార్కులపై చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. బంగారు, వెండి ఆభరణాలు గల్లంతైనా, వాటిపై విచారణ కమిటీ నివేదిక ఇచ్చి ఆరు నెలలైనా బాధ్యులపై చర్యలు చేపట్టడం లేదు. ఆభరణాల మాయం కావడానికి కారణమైన వారిలో ముగ్గురు అధికారులు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు వారిపై చర్యలు చేపడితే రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు దెబ్బతింటాయని కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీనృసింహస్వామికి చెందిన ఆభరణాలతో పాటు ఉప ఆలయాల్లో కొన్ని బంగారు, వెండి వస్తువులు కనిపించడం లేదని కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకార ఆచారి 2024 నవంబరులో ఫిర్యాదు చేశారు. 2025 జనవరిలో దేవదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అదే ఏడాది జూన్‌లో విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు కూడా లేఖ రాశారు. రాజమహేంద్రవరంలో ఉంటున్న దేవదాయ శాఖ అధికారి ఒకరు తనను ఇదే అంశంపై బెదిరిస్తున్నారని, త్వరగా విచారణ చేపట్టాలని కూడా ఆయన ఉన్నతాధికారులను కోరారు. ఆ తరువాత 2025 ఆగస్టులో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక తప్పదన్నట్టుగా దేవదాయ శాఖ అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ 2025 సెప్టెంబరు 10న ‘సింహాచలం సిరి గల్లంతు’ శీర్షికతో కథనం ప్రచురించింది. జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి (జేవీఓ) తనిఖీలో ఆభరణాల మ్యూజియంలో బంగారు ముత్యాల హారం 65 గ్రాములు తక్కువ ఉందని తేలింది. ఉప ఆలయాలకు భక్తులు ఇచ్చిన పది కిలోల బరువు కలిగిన 16 వెండి వస్తువులను రిజిస్టర్‌లో నమోదు చేయలేదని బయటపడింది. వాటిని బయటకు తీసుకుపోయే ఆలోచనతోనే రికార్డు చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. భక్తులు విరాళంగా ఇచ్చే ఖరీదైన వస్తువులకు రశీదులు ఇవ్వడం లేదని గుర్తించి అది కూడా నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం చర్యలు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు జాప్యం చేశారు. దీనిపై మళ్లీ ఫిర్యాదీ ప్రభాకర ఆచారి లేఖలు రాయడంతో ఈసారి ఐదుగురితో కమిటీ వేసి, వారు విచారణ చేస్తారని ప్రకటించారు. ఆ కమిటీ కూడా తనిఖీలు పూర్తిచేసి నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో బదిలీలు జరగ్గా, ఓ ఏఈఓ వేరొక ఆలయానికి వెళుతూ తన ఆధీనంలో ఆభరణాలను డిప్యూటీ ఈఓ రాధకు అప్పగించారు. వాటిలో రికార్డుల్లో నమోదుకాని వెండి ఆభరణాలు 47 వరకు ఉండడాన్ని గుర్తించారు. వాటి బరువు సుమారు 20 కిలోలు. వాటికి రశీదులు కూడా లేవని తేలింది. దీనిపై ఆ ఏఈఓను వివరణ కోరారు. ఆయన సమాధానానికి సంతృప్తి చెందారా? లేదా? అనేది తెలియదు. అదేవిధంగా దేవస్థానంలో ప్రధాన అర్చకుల వద్ద ఉండాల్సిన స్వామి సేవకు సంబంధించిన బంగారు వస్తువుల్లో ఎనిమిది లెక్కకు దొరకలేదు. వాటి బరువు 11 తులాల వరకు ఉంటుందని గుర్తించారు. ఆ జాబితాలో అమ్మవారి మంగళ సూత్రాలు వంటివి ఉన్నాయి. వెండి వస్తువుల్లో 39 కనిపించలేదు. వాటి బరువు సుమారు 120 కిలోలు. అందులో ద్వారానికి అమర్చే వెండి తాపడాలు, పళ్లేలు వంటివి ఉన్నాయి. వీటిపై ప్రధాన అర్చకులను వివరణ కోరితే అధికారికంగా తమకు వాటిని ఇవ్వలేదని చెప్పినట్టు తెలిసింది. ఈ వివరాలన్నీ పేర్కొంటూ ఐదుగురు సభ్యుల కమిటీ గత అక్టోబరు నెలలోనే నివేదిక అందజేసింది. ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. బాధ్యులుగా పేర్కొన్న వారిలో ముగ్గురు పదవీ విరమణ పొంది, వారి ప్రయోజనాలన్నీ తీసుకున్నాక, తూతూమంత్రపు చర్యలు చేపట్టాలని జాప్యం చేస్తున్నారని తెలిసింది.

బహిరంగ విచారణకు డిమాండ్‌

ఆభరణాల గల్లంతుపై ఫిర్యాదు చేసిన ప్రభాకర ఆచారి నివేదిక కాపీ కావాలని కోరగా అధికారులు ఇవ్వలేదు. ఆభరణాలు ఏమీ పోలేదని అధికారులు చెబుతున్నారని, కాబట్టి దేవస్థానానికి చెందిన ప్రముఖుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాలని, తాను కూడా దానికి హాజరవుతానని, దానికి ఏర్పాట్లు చేయాలని ఆయన తాజాగా దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. భక్తులు ఇచ్చే ఆభరణాలను దారి తప్పిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


సముద్ర తీరంలో మొక్కల పెంపకంలో అక్రమాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో అటవీ శాఖ ఎంక్వయిరీ

ఏడాదైనా చర్యలు శూన్యం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి):

సముద్ర తీరంలో చేపట్టిన సరుగుడు మొక్కల పెంపకంలో జరిగిన అవినీతిపై విచారణ నివేదికను బుట్టదాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖలో కొందరు అధికారులు కావాలనే విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకోవడం లేదని తెలిసింది. తుఫాన్‌ల సమయంలో పెనుగాలుల తీవ్రత తగ్గించడం, సముద్ర కోత నివారణ కోసం తీరంలో అటవీ శాఖ సరుగుడు, ఇతర మొక్కల పెంపకం చేపడుతుంటుంది. ఈ క్రమంలోనే విశాఖ పోర్టు ఇచ్చిన రూ.40 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో గుడ్లవానిపాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలో ఉన్న సాగర్‌నగర్‌ వద్ద తీరంలో సుమారు పాతిక ఎకరాల విస్తీర్ణంలో మూడేళ్ల క్రితం సరుగుడు, బాదం మొక్కలు నాటారు. షెల్టర్‌ బెల్ట్‌ చుట్టూ ఫెన్సింగ్‌ కోసం రూ.18 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.22 లక్షలు కేటాయించారు. మొక్కలు నాటిన తరువాత వాటి సంరక్షణ విషయంలో అప్పటి అధికారులు విఫలమయ్యారు. ఆ ప్రాంతంలో బోర్లు వేయకుండా బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్టు తప్పుడు లెక్కలు చూపించారు. నీరు లేకపోవడం, మొక్కల చుట్టూ కలుపుతీయకుండా వదిలేయడంతో సరైన పోషణ అందక చాలావరకు చనిపోయాయి. ప్రస్తుతం షెల్టర్‌ బెల్టు ఏరియాలో అక్కడక్కడా మాత్రమే సరుగుడు మొక్కలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతమంతా ఖాళీగా ఉంది. నాసిరకం మెటీరియల్‌తో షెల్టర్‌ బెల్టు చుట్టూ ఫెన్సింగ్‌ వేశారనే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతో అటవీ అధికారులు విచారణ జరిపారు. అయితే ఆ నివేదిక ఏమైందో ఇప్పటివరకూ వెలుగుచూడలేదు. బుట్టదాఖలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2026 | 01:15 AM