Share News

ప్రచారానికి తెర

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:15 AM

జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

ప్రచారానికి తెర

ఆఖరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

భారీ ర్యాలీలు

ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ప్రజల వద్దకు కూటమి మేయర్‌ అభ్యర్థిని ముక్కా శ్రావణి

ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థిని వరుదు కళ్యాణి ప్రచారం

డబ్బు, మద్యం పంపిణీ ఏర్పాట్లలో అభ్యర్థులు?

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆదివారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు మరొకరోజు గడువు ఉండడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్లో అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు.

జీవీఎంసీ ఎన్నికలకు ఈనెల 14న నోటిఫికేషన్‌ జారీ అయింది. మేయర్‌ పదవికి 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసేసరికి 15 మంది పోటీలో నిలిచారు. అలాగే 120 వార్డుల్లో కార్పొరేటర్‌ పదవులకు 1,672 మంది నామినేషన్లు దాఖలు చేయగా చివరకు 573 మంది పోటీలో మిగిలారు. కూటమి మేయర్‌ అభ్యర్థిని ముక్కా శ్రావణి, వైసీపీ మేయర్‌ అభ్యర్థిని వరుదు కల్యాణి ఎవరిశైలిలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామనేది నగర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. శుక్రవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో కూటమి అభ్యర్థిని ముక్కా శ్రావణి, ఎంపీ శ్రీభరత్‌తో కలిసి 52వ వార్డు పరిధిలోని నక్కవానిపాలెం, 51వ వార్డు పరిధిలోని సీతమ్మధార, 50వ వార్డు, 61, 36, 37 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థిని వరుదు కళ్యాణి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలతో కలిసి ప్రచారం చేశారు. కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా చివరిరోజు ర్యాలీలు నిర్వహించి ఐదు గంటలకు తమ ప్రచారాన్ని ముగించారు. గడువు ముగియడంతో గత వారం రోజులుగా వీధుల్లో హోరెత్తించిన ప్రచార రథాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో ఇప్పుడు అభ్యర్థులంతా ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర బహుమతులు పంపిణీ చేయడంపై దృష్టిసారించారు.


నేడు సెలవు

పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు మాత్రమే

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల నిమిత్తం పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శనివారం సెలవు ప్రకటిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన సంస్థలకు ఓట్ల లెక్కింపు రోజున (నవంబరు 3న) సెలవు ఉంటుందని తెలిపారు.


ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలి..

ప్రైవేటు సంస్ధలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు నవంబరు ఒకటో తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు కలెక్టర్‌ సూచించారు. పూర్తిగా సెలవు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలో ఓటు వేసేందుకు కనీసం మూడు గంటల పాటు వెసులుబాటు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, ఎంసీసీ నిబంధనలను అందరూ పాటించాలని ప్రకటనలో పేర్కొన్నారు.


సిబ్బంది, సామగ్రి రవాణాకు 350 బస్సులు

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల విధులకు ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం 350 బస్సులు కేటాయించింది. ఇవన్నీ శని, ఆదివారాల్లో ఎన్నికల విధుల్లో ఉంటాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ బస్సులు శనివారం ఉదయం భీమిలి, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలోని జీవీఎంసీ జోనల్‌ కార్యాలయాలకు చేరుకుంటాయి. అక్కడ ఎన్నికల నిర్వాహణాధికారులు కేటాయించిన 201 రూట్లలోని 1,990 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని రవాణా చేయనున్నాయి. శనివారం సాయంత్రానికి ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆదివారం పోలింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్‌ బాక్సులను, సిబ్బందిని తిరిగి జోనల్‌ కార్యాలయాలకు రవాణా చేయనున్నాయి. ఎన్నికల విధులకు కేటాయించిన బస్సులకు ఎటువంటి సాంకేతిక లోపాలు ఎదురుకాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు ఏడు డిపోల మేనేజర్లకు సూచించారు.


ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం

శత శాతం వార్డులు గెలవాలని కూటమి పెద్దల దిశానిర్దేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఎన్నికలు నగరంలోని ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అంతా తమ పరిధిలోని కూటమి అభ్యర్థులను శతశాతం గెలిపించుకుని రావాల్సిందేనని పార్టీల పెద్దలు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

జీవీఎంసీ ఎనిమిది నియోజక వర్గాలకు విస్తరించి ఉంది. భీమిలి నియోజకవర్గ పరిధిలో 12, తూర్పు నియోజకవర్గంలో 18, దక్షిణ నియోజకవర్గంలో 16, ఉత్తర నియోజకవర్గంలో 20, పశ్చిమ నియోజకవర్గంలో 17, గాజువాక పరిధిలో 19, పెందుర్తి నియోజకవర్గం పరిధిలో 12, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఆరు వార్డులు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట సగం వార్డులను ఆ పార్టీకి కేటాయించారు. మొత్తం 120 వార్డుల్లో టీడీపీ 77, జనసేన 32, బీజేపీ 11 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. కూటమి అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలని అన్ని పార్టీల నేతలు అవగాహన కుదుర్చుకున్నారు. కూటమి పెద్దలు కూడా నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల గెలుపునకు సంబంధిత ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఓటమి పాలైతే సంబంధిత ఎమ్మెల్యేలనే బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. అయితే ఎంపీ శ్రీభరత్‌ అన్ని నియోజక వర్గాల్లో విరామం లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో తిరిగి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయగా, మరికొందరు మొక్కుబడిగా పాల్గొన్నట్టు చెబుతున్నారు.


రెండున్నరేళ్లలో రూ.వేల కోట్లతో నగరాభివృద్ధి

28,500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నగర ప్రజలకు జిల్లా ఇన్‌చార్జి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ పాలనలో దందాలు, భూకబ్జాలు తప్ప నగరానికి చేసిందేమీ లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో విశాఖకు ప్రతిష్టాత్మకమైన గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థను తీసుకువచ్చామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లు విశాఖను దేశంలో నంబర్‌వన్‌ సిటీగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న 28,500 మందికి ఇటీవల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కల నెరవేర్చామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్న రైల్వేజోన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆర్థికంగా చేయూతనిచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి గోదావరి జలాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. తమ పాలనలో వేలాది కోట్ల రూపాయలతో నగరాభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని ఆదరించే మనస్తత్వం ఉన్న ప్రజలు జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

Updated Date - Oct 31 , 2026 | 01:15 AM