Share News

బీచ్‌రోడ్డులో ఆక్రమణలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:26 AM

నగరంలోని రామకృష్ణా బీచ్‌రోడ్డు పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

బీచ్‌రోడ్డులో ఆక్రమణలు

ఇష్టానుసారంగా అనధికార నిర్మాణాలు

100 నుంచి 400 గజాలు లీజుకు ఇచ్చిన జీవీఎంసీ

అంతకు రెట్టింపు విస్తీర్ణం

తమ ఆధీనంలో ఉంచుకుంటున్న వ్యాపారులు

ఇతరులకు సబ్‌ లీజు...

పట్టించుకోని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని రామకృష్ణా బీచ్‌రోడ్డు పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ప్రజా ప్రతినిధులకు ఇవేమీ పట్టడం లేదు.

పర్యాటకులతో పాటు నగరవాసులు కూడా సాయంత్రమైతే రామకృష్ణా బీచ్‌కు వెళ్లి కాసేపు సేదతీరుతుంటారు. ఇటీవల బీచ్‌కు జనాల తాకిడి మరింత ఎక్కువైంది. శని, ఆదివారాల్లో వాహనాలను రహదారులపైనే పార్కింగ్‌ చేసుకోవలసి వస్తోంది. బీచ్‌రోడ్డులో రెండో వైపు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటుచేసిన ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవడానికి కొందరికి అద్దె ప్రాతిపదికన జీవీఎంసీ అధికారులు స్థలాలు కేటాయించారు. వారిలో చాలామంది కేటాయించిన స్థలం కంటే ఎక్కువ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 100 నుంచి 200 గజాల స్థలంలో రెస్టారెంట్‌ పెట్టుకొని పక్కన మరో 300 గజాలు ఆక్రమించి అందులో కుర్చీలు, టెంట్లు వేసుకుంటున్నారు. ఇలాంటి వారిని అధికారులు నియంత్రించడం లేదు. తాజాగా సిల్వర్‌ స్పూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థ పార్కు ఏరియాలో భారీగా అనధికార నిర్మాణాలు చేపట్టింది. వారికి 2022 మే నెలలో 420 గజాల స్థలాన్ని జీవీఎంసీ మూడేళ్ల కాలానికి లీజుకు ఇచ్చింది. నెలకు రూ.1.6 లక్షల అద్దె నిర్ణయించింది. వారి గడువు గత ఏడాది ముగిసింది. అయితే సదరు సంస్థ పక్కన మరో వేయి గజాల వరకు స్థలాన్ని ఆక్రమించి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టింది. అక్కడ కొన్నింటిని ఇతరులకు అద్దెకు ఇచ్చింది. ఇది అన్యాయమని పలువురు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. వారిలాగే స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన ఓ రెస్టారెంట్‌, కేఎఫ్‌సీ సంస్థలు అదనంగా స్థలాలు ఆక్రమించి ఉపయోగించుకుంటున్నాయని ఫిర్యాదులు అందగా, వారి నుంచి ఆయా స్థలాలకు అదనపు మొత్తాలు వసూలుచేశారు. సిల్వర్‌ స్పూన్‌పై కూడా నివేదిక తయారుచేసి, ఎంత మొత్తం వసూలు చేయాలో నిర్ణయించారు. కానీ వసూలు చేయలేదు. ఏ ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు. ఇప్పుడు అదే సంస్థ మరో 400 గజాలు అదనంగా కేటాయించారంటూ కొత్త నిర్మాణాలు చేపట్టింది. అక్కడ ఆ సంస్థ ఇప్పుడు సుమారు 1,800 గజాల స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. అద్దె మాత్రం నామమాత్రంగానే చెల్లిస్తోంది. ఇలాంటి సంస్థకు మరో మూడేళ్లు లీజు కాలం పొడిగించడం గమనార్హం.

కొత్తగా ఆశీలు వసూలు

వ్యాపార సముదాయాలు, సంతల్లో వ్యాపారాలు చేసే వారి నుంచి జీవీఎంసీ ఆశీలు వసూలు చేస్తుంది. ఆర్‌కే బీచ్‌రోడ్డులో చిల్లర వ్యాపారాలు చేసుకునే వారి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. గతంలో వారంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, తమకు అద్దె నిర్ణయిస్తే...అందరిలానే తాము కూడా కడతామని ఒక వినతిపత్రం సమర్పించారు. దానిని పట్టించుకోని అదికారులు తాజాగా బీచ్‌రోడ్డులో అన్ని రకాల వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తాను రూ.30 లక్షలకు కాంట్రాక్టు తీసుకున్నానని, చిన్న వ్యాపారులు అంటే పానీపూరీ, కూల్‌డ్రింక్స్‌, న్యూడిల్స్‌ అమ్మేవారు రోజుకు రూ.50, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, చికెన్‌/ఫిష్‌ వంటకాలు, స్వీట్‌ కార్న్‌, మురీ మిక్చర్‌ అమ్మేవారు రోజుకు రూ.100, బిర్యానీలు, దుస్తులు విక్రయించేవారు రూ.200 ఆశీలు కట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌కే బీచ్‌ నుంచి జోడుగుళ్లపాలెం వరకు ఇలా వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారని కాంట్రాక్టర్‌ కరపత్రాలు పంచిపెడుతున్నారు. కనీసం మరుగు వసతి కూడా కల్పించకుండా ఇలా ఆశీలు వసూలు చేయడం ఏమిటని వ్యాపారులకు నిరసిస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:26 AM