చెరువు గట్టు కబ్జా
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:32 AM
కశింకోట మండలం బయ్యవరంలో బొగ్గు యార్డు నిర్వాహకుల అడ్డగోలు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
యార్డు నుంచి బొగ్గు రవాణా కోసం దర్జాగా ఆక్రమణ
రోడ్డు నిర్మాణంతోపాటు సెక్యూరిటీ సిబ్బందికి షెడ్డు
స.హ. చట్టం ద్వారా వెలుగు చూసిన పవర్ ప్లాంట్ ఆక్రమాలు
కబ్జా చేసిన భూమి విలువ రూ.9 కోట్లు!
పీజీఆర్‌ఎస్‌లో గ్రామస్థుల ఫిర్యాదు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కశింకోట మండలం బయ్యవరంలో బొగ్గు యార్డు నిర్వాహకుల అడ్డగోలు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బొగ్గు నిల్వ చేసుకొనేందుకు అనుమతి పొందిన స్థలానికి సమీపంలో వున్న పేరంటాలమ్మ చెరువు గట్టును కబ్జా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కశింకోట తహశీల్దారుగా పనిచేసిన ఒక అధికారి.. చెరువు గట్టు మీదుగా బొగ్గు లారీల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఆక్రమణదారులు తరువాత గట్టుపై రోడ్డు నిర్మించి, తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలసలో ఉన్న ఒక ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ యాజమాన్యం ఇతర ప్రాంతాల నుంచి రైలు వ్యాగన్ల ద్వారా బొగ్గును దిగుమతి చేసుకొంటున్నది. ఇందుకోసం బయ్యవరం రైల్వే స్టేషన్ సమీపంలో పదేళ్ల కిందట యార్డును ఏర్పాటు చేశారు. వ్యాగన్ల ద్వారా వచ్చిన బొగ్గును ఇక్కడ అన్‌లోడ్ చేసుకొని, అనంతరం టిప్పర్ల ద్వారా కంపెనీకి తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి బొగ్గును రవాణా చేసే వాహనాలు జాతీయ రహదారిపైకి త్వరగా చేరుకోవడానికి అనువుగా వుంటుందని భావించిన బొగ్గు యార్డు నిర్వాహకులు పేరంటాలమ్మ చెరువు గట్టును ఆక్రమించారు. కాగా జల వనరులు, రెవెన్యూ శాఖల రికార్డుల ప్రకారం కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో సర్వే నంబర్లు 222/1, 222/2, 223 లో సుమారు ఆరున్నర ఎకరాల్లో పేరంటాలమ్మ చెరువు ఉంది. సర్వే నంబరు 222/1 లో వున్న చెరువు గట్టు సుమారు 70 సెంట్లు వుంటుంది. దీనిని ఆక్రమించి రోడ్డు నిర్మించారు. ఇదికాక 222/2లో మరో 20 సెంట్ల మేర చెరువు భూమిని ఆక్రమించి యార్డు సెక్యూరిటీ సిబ్బంది కోసం షెడ్లు నిర్మించిఇ గేట్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో ఇక్కడ ఎకరా రూ.10 కోట్లు పలుకుతున్నది. ఈ లెక్కన బొగ్గు యార్డు నిర్వాహకులు ఆక్రమించిన భూమి విలువ సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు వుంటుందని అంచనా. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు వున్నాయని నమ్మబలుకుతూ చెరువు గట్టును రోడ్డుగా మార్చేసి దర్జాగా వినియోగించుకొంటున్నారు.
స.హ. చట్టం దరఖాస్తుతో బయటపడిన కబ్జా
బొగ్గు యార్డు వల్ల తాము పడుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోకపోవడంతో స.హ.చట్టం కింద దరఖాస్తు చేసి వివరాలు సేకరించారు. పవర్ ప్లాంట్ యాజమాన్యం బొగ్గు రవాణా కోసం పేరంటాలమ్మ చెరువును ఆక్రమించుకొన్నట్టు తేలింది. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. బొగ్గు యార్డు వల్ల తాము పడుతున్న ఇబ్బందులు, బొగ్గు రవాణా కోసం చెరువు గట్టు ఆక్రమణ గురించి ఇందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే చేయించి, పేరంటాలమ్మ చెరువు భూమిని గ్రామానికి అప్పగించాలని డీఆర్వోను కోరారు.