Share News

సాగునీటి చెరువు ఆక్రమణ

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:54 AM

మండలంలోని గిడుతూరులో చుక్కలయ్య సాగునీటి చెరువు కబ్జాకు గురవుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ప్రకృతి నీటి వనరులను ధ్వంసంచేస్తున్నారు. చెరువు మధ్యలో నుంచి రహదారి నిర్మాణం జరుగుతుంటే జలవనరుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సాగునీటి చెరువు ఆక్రమణ
గిడుతూరులో చెరువు మధ్యలో నుంచి నిర్మిస్తున్న రహదారి

ఆలయానికి కోనేరు నిర్మాణం పేరుతో రోడ్డు ఏర్పాటు

చోద్యం చూస్తున్న జలవనరుల శాఖ అధికారులు

మాకవరపాలెం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిడుతూరులో చుక్కలయ్య సాగునీటి చెరువు కబ్జాకు గురవుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ప్రకృతి నీటి వనరులను ధ్వంసంచేస్తున్నారు. చెరువు మధ్యలో నుంచి రహదారి నిర్మాణం జరుగుతుంటే జలవనరుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిడుతూరు గ్రామంలో చుక్కలయ్య చెరువు సుమారు 100 ఎకరాల్లో విస్తరించి వుంది. దీనికింద దాదాపు 400 ఎకరాల ఆయకట్టు వుంది. చెరువుకు ఒక పక్కన పెద్ద పెద్ద బండరాళ్లు వున్నాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ రాళ్లను కప్పేసి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇది చివరి దశలో వుంది. ఈ ఆలయానికి అనుబంధంగా కోనేరు నిర్మిస్తామంటూ చెరువు మధ్యలో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే చెరువును ఆక్రమించడమే కాకుండా, అడ్డంగా రోడ్డు నిర్మిస్తుండడంతో ఇటీవల కొంతమంది స్థానికులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న వాహనాలను స్టేషన్‌కు తీసుకెళ్లి, కొద్దిసేపటి తరువాత వదిలేశారు. కాగా కోనేరు నిర్మాణం పేరుతో చెరువులో నుంచి వేసిన రోడ్డును తొలగించాలని కోరుతున్నప్పటికీ ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడంలేదని సాగునీటి సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చుక్కలయ్య చెరువును కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:54 AM