Share News

ప్రభుత్వ భూమికి ఎసరు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:39 AM

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపుపొందిన విశాఖ నగరంలో భూములకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

ప్రభుత్వ భూమికి ఎసరు

  • పెదరుషికొండ సర్వే నంబర్‌ 7లో 3,000 గజాల ప్రభుత్వ స్థలం

  • రెవెన్యూ రికార్డుల్లో ఏడబ్ల్యూడీగా నమోదు

  • పక్క సర్వే నంబర్లతో ఇతరులకు విక్రయించిన కొందరు...

  • గతంలో సిట్‌కు అందిన ఫిర్యాదు...

  • సర్కారుకు చెందినదిగా నిర్ధారించిన రెవెన్యూ అధికారులు

  • అయినా ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే...

  • ఆ భూమి తమదంటూ న్యాయస్థానంలో ప్రైవేటు వ్యక్తులు పరస్పరం కేసులు

  • చోద్యం చూస్తున్న అధికారులు

  • విలువ రూ.30 కోట్లుపైనే..

  • కలెక్టర్‌ దృష్టిసారించకపోతే విలువైన భూమి చేజారిపోవడం ఖాయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపుపొందిన విశాఖ నగరంలో భూములకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు పాగా వేసేందుకు కొందరు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేవిధంగా విశాఖ రూరల్‌ మండలం పరిధి పెదరుషికొండలో సుమారు రూ.30 కోట్లకుపైగా విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. రెవెన్యూ సహకారంతో అధికారికంగా చేజిక్కించునేందుకు యత్నిస్తున్నారు.

పెదరుషికొండ గోశాల పక్కన బీచ్‌రోడ్డుకు ఆనుకుని సర్వే నంబర్‌ 7/1, సర్వేనంబర్‌ 7/2లో 8.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌ వేస్ట్‌ డ్రై (ఏడబ్ల్యూడీ) అని స్పష్టంగా నమోదై ఉంది. అందులో చాలావరకు బీచ్‌రోడ్డు విస్తరణలో పోగా సుమారు మూడు వేలు గజాలు (దాదాపు 60 సెంట్లు) మిగిలింది. బీచ్‌రోడ్డుకు ఆనుకుని ఉండడం, పర్యాటకంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావడంతో ఆ భూమి విలువ కనీసం రూ.30 కోట్లు ఉంటుంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు తప్పుడు పత్రాలను సృష్టించి ఆక్రమించారు. తర్వాత వేరొకరికి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నందున రిజిస్ర్టేషన్‌ చేయడం కుదరదు కాబట్టి, పక్కనే ఉన్న పెదరుషికొండ సర్వే నంబర్‌ 6గా చూపించారు. కొనుగోలు చేసి వ్యక్తులు మూడు ముక్కలుగా విభజించి ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు. దీనిపై కొందరు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేసి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ సిట్‌కు నివేదిక అందజేశారు. తర్వాత సిట్‌ నివేదిక బయటకు రాకపోవడంతో ఆ భూమిలో ప్రైవేటు వ్యక్తులు తిష్ఠ వేశారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్న వివరాలు, ఇతర ఆధారాలను బట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉంది. భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటుచేయాలి. కానీ రెవెన్యూ అధికారులు ఇంతవరకూ ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలనే స్పృహ లేకుండా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారుల సహకారం

ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్న భూమిని ఆక్రమించి, ఇతరులకు విక్రయించడం నేరం కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అందుకు విరుద్ధంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి తమదంటూ ఒకరు...కాదు తమదంటూ మరొకరు 2018లో కోర్టులో కేసు వేసుకున్నారు. ప్రభుత్వ భూమిపై ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు హక్కు కోసం కోర్టుకు వెళ్లడం భూకబ్జా వ్యవహారాల్లో సర్వసాధారణమని, కోర్టు ఎవరికో ఒకరికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఇద్దరు పిటిషనర్లు ప్రయోజనం పొందేలా తెర వెనుక ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారని, అధికారులు జోక్యం చేసుకుని తగిన ఆధారాలు సమర్పిస్తే వారి ప్రయత్నాలు ఫలించవని రెవెన్యూ శాఖలో గతంలో పనిచేసిన కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే పెదరుషికొండ భూ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పెదగదిలి తహశీల్దార్‌ కార్యాలయం అధికారులు, సిబ్బందిని ఆరా తీస్తే రికార్డులు పరిశీలించకుండా ఏమీ చెప్పలేమంటూ దాటవేస్తూ వచ్చారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టిసారించి ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


నకిలీ పత్రాలతో రూ.కోటి స్థలం కాజేత

వేరొకరికి అమ్మాలని యత్నించి దొరికిన నిందితులు

వారిలో మహిళే కీలకం

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో భూముల విలువ పెరగడంతో తమది కాని భూమిని కూడా అమ్మి సొమ్ము చేసుకోవడానికి పలువురు యత్నిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఏకంగా హక్కుదారులు చనిపోయారని, వారి వారసులం తామే అని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. తాజాగా మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాగే తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి యత్నించి నిందితులు పోలీసులకు దొరికిపోయారు.

గాజువాక చైతన్య నగర్‌కు చెందిన పన్నెం చంద్రబాబు భార్య త్రిమూర్తుల దేవిపేరుతో మధురవాడ సర్వే నంబరు 329లోని శ్రీకృష్ణా కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో స్థలం ఉంది. ఆ లేఅవుట్‌ మొత్తం 18.36 ఎకరాల్లో వేయగా అందులో సూర్యశక్తి నగర్‌లోని ప్లాట్‌ నంబరు 91 ద్వారా 200 గజాల స్థలాన్ని భార్య పేరిట చంద్రబాబు కొన్నారు. ఆమె 2023 డిసెంబరులో మరణించారు. ఈ విషయం ఎలా తెలిసిందో గానీ ఒక ముఠా ఈ ఆస్తికి తప్పుడు పత్రాలు సృష్టించింది. చంద్రబాబు, త్రిమూర్తులదేవి ఇద్దరూ వేర్వేరు తేదీల్లో చనిపోయారని మరణ ధ్రువీకరణ పత్రాలు నకిలీవి తయారుచేశారు. చంద్రబాబుకు ఇద్దరు కుమారులు ఉండగా, ఆ విషయం దాచి పెట్టి ఆ దంపతుల ఏకైక కుమార్తెను తానే అంటూ మద్దిలపాలెం రామాలయం వీధికి చెందిన నైనాల కీర్తిక (30) క్లెయిమ్‌ చేశారు. గాజువాక అధికారులు ఇచ్చినట్టు వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించింది. ఆ విధంగా కోటి రూపాయల విలువైన భూమి తనదే అని, దానిని కంచరపాలేనికి చెందిన అలమండ కుమార్‌కు ఈ ఏడాది మే నెలలో జీపీఏ చేసింది. ఈ వ్యవహారం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగింది. ఆ భూమిని అలమండ కుమార్‌ వేరే వారికి అమ్మడానికి యత్నించారు. వారు ఆ పత్రాలను పరిశీలన కోసం తెలిసిన ఒక వ్యక్తి వద్దకు తీసుకువెళ్లగా, వాటిని పరిశీలించిన ఆయన ఆ పత్రాల్లో చనిపోయినట్టు పేర్కొన్న చంద్రబాబు చనిపోలేదని, ఆయన బతికే ఉన్నారని, తనకు వారు తెలుసునని చెప్పడంతో వారు కొనకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి చంద్రబాబుకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో ఆయన పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. తన భూమికి రక్షణ కల్పించాలని సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణికి వినతిపత్రం అందించారు. అయినాసరే జీపీఏ చేయించుకున్న కుమార్‌ ఆ భూమిని వేరొకరికి అమ్మడానికి యత్నించాడు. దానిని వేరొకరికి రిజిస్టర్‌ చేయడానికి కీర్తిక, ఆమె భర్త మద్దిలపాలెం నుంచి రాగా అలమండ కుమార్‌, మరో ముగ్గురు సాక్షులు శనివారం మధురవాడ వెళ్లారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అవి నకిలీ పత్రాలని చెప్పి, పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఒక ముఠా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:39 AM