కాపుశెట్టిపాలెంలో చెరువు కబ్జా
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:27 AM
అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ పరిధిలోని కాపుశెట్టిపాలెంలో పాత్రుని చెరువు కబ్జాకు గురైంది. కొంతమంది వ్యక్తులు దీనిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ నకిలీ పట్టాలు సృష్టించారు. ఇందులో సుమారు ఏడు ఎకరాల చెరువు గర్భంలో స్టోన్ క్రషర్ల ఏర్పాటుకు లీజుకు ఇచ్చేశారు. పాత్రుని చెరువు కబ్జాపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
అధికారుల అండతో రికార్డులు తారుమారు
నకిలీ రిజిసే్ట్రషన్ పత్రాలతో తమదిగా చెప్పుకుంటున్న ఆక్రమణదారులు
స్టోన్ క్రషర్‌కు ఏడు ఎకరాలు లీజు
రీ-సర్వే పేరుతో పూర్తిగా సొంతం చేసుకునేందుకు కుట్ర
అడ్డుకున్న గ్రామస్థులు
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ పరిధిలోని కాపుశెట్టిపాలెంలో పాత్రుని చెరువు కబ్జాకు గురైంది. కొంతమంది వ్యక్తులు దీనిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ నకిలీ పట్టాలు సృష్టించారు. ఇందులో సుమారు ఏడు ఎకరాల చెరువు గర్భంలో స్టోన్ క్రషర్ల ఏర్పాటుకు లీజుకు ఇచ్చేశారు. పాత్రుని చెరువు కబ్జాపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
రేబాక పంచాయతీ పరిధిలోని కాపుశెట్టిపాలెంలో సర్వే నంబర్ 243లో పాత్రుని చెరువు వుంది. దీని మొత్తం విస్తీర్ణం 13.7 ఎకరాలు. అనాదిగా ఈ చెరువు నీరు ఆధారంగా స్థానిక రైతులు పంటలు పండించుకుంటున్నారు. రెవెన్యూ, జలవనరుల శాఖల రికార్డుల్లో ఇది ప్రభుత్వ చెరువుగా నమోదై వుంది. అయితే చెరువును ఆనుకొని జిరాయితీ భూములు వున్న కొంతమంది వ్యక్తులు చెరువు గర్భాన్ని ప్రైవేటు భూమిగా చూపిస్తూ నకిలీ పట్టాలు సృష్టించారు. ఇందులో ఏడు ఎకరాలను స్టోన్ క్రషర్లు ఏర్పాటుకు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ స్టోన్ క్రషర్లు నడుస్తున్నారు. కాగా చెరువు మొత్తం తమదిగా చెప్పుకునేందుకు అధికారులతో కుమ్మక్కై నకిలీ రిజిసే్ట్రషన్ పత్రాలతో రీ-సర్వే చేయించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. రీ-సర్వేను అడ్డుకొన్నారు. చెరువు వాస్తవ విస్తీర్ణం, గట్లు, నీటి ప్రవాహ మార్గాలను పరిగణనలోకి తీసుకోకుండా సర్వే చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రికార్డుల్లో ప్రభుత్వ చెరువుగా నమోదైన భూమిని ఏ ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేశారో అధికారులు చెప్పాలని నిలదీశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
పాత్రుని చెరువు ఆక్రమణపై అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాజాగా రీ-సర్వే మాటున నకిలీ పట్టాలు చూపించి, చెరువును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నీటి సంఘం చైర్మన్ మంత్రి కాసులునాయుడు, రైతులు మంత్రి సత్తిబాబు, గనిశెట్టి రాజు, శివశంకర్, అర్జునరావు ఆరోపిస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పాత్రుని చెరువు కబ్జాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వీబీ జీ రామ్‌జీ కింద చెరువులో పూడిక తీయించి సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.