గెడ్డ కబ్జా
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:24 AM
నగరంలో ఎక్కడికక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.
నిర్మాణ సంస్థ బరితెగింపు
చుట్టూ రేకులు ఏర్పాటు
ఫిర్యాదులు అందినా స్పందించని జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ఎక్కడికక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఎక్కడో జన సంచారం లేని ప్రాంతాల్లో ఇలాంటివి జరిగితే తెలియక అధికారులు చర్యలు చేపట్టలేదనుకోవచ్చు. కానీ భారీ అపార్టుమెంట్ల మఽధ్య, నగరంలో అత్యంత విలువైన ఎండాడలోనే గెడ్డ కబ్జాకు గురైతే ఏమీ తెలియనట్టు నటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
గోధ డెవలపర్స్ అనే సంస్థ ఎండాడలో పలువురి నుంచి ఇళ్ల స్థలాలను సేకరించి భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం కట్టింది. ఎండాడ సర్వే నంబర్లు 69/2ఏ, 69/2బి, 69/3, 69/4ఏ, 69/4బిలలో నిర్మాణం కోసం చుట్టూ రేకులు ఏర్పాటుచేసింది. అయితే ఈ భూముల మధ్య నుంచి ఒక గెడ్డ ప్రవహిస్తోంది. దానిని అలాగే వదిలేసి, అటుఇటు నిర్మాణం చేసుకోవచ్చు. అలాగైతే స్థలం కలిసి రాదని ప్రాజెక్టు నిర్వాహకులు గెడ్డలో చిన్న పైపులైను వేసేసి పైన కప్పేశారు. అంటే గెడ్డ స్థలాన్ని వారి భూమిలో కలిపేసుకున్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షానికి పైనుంచి భారీగా వరద రావడంతో గెడ్డ విషయం బయటపడింది. దీనిపై స్థానికులు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేయగా కొంతకాలం పనులు ఆపేశారు. మళ్లీ ఇప్పుడు వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు స్థలంలో గెడ్డను కలిపేసుకున్నారంటూ పర్యావరణంపై పోరాటం చేస్తున్న బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ వేదికగా జీవీఎంసీ, రెవెన్యూ అధికారులను ట్యాగ్ చేస్తూ ఇటీవల పోస్టింగ్ పెట్టారు. స్థానికులు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకూ జీవీఎంసీ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోలేదు. అక్కడ ఇప్పటికే కొన్ని గెడ్డలను కప్పేయడం వల్ల వర్షాలు పడితే ఆయా ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ఇంకా ఆ భూమిలో నిర్మాణం పూర్థిస్థాయిలో చేపట్టలేదు కాబట్టి గెడ్డ స్థలం ఆక్రమణలు తొలగించి, ప్రవాహానికి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది.