Share News

ప్రభుత్వ భూముల కబ్జా

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:40 AM

మండలంలోని వెదుళ్లనరవ (జీవీఎంసీ పరిధి)లో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణ జరిగిపోతున్నది.

ప్రభుత్వ భూముల కబ్జా

సమీపంలో ఉన్న జిరాయితీ భూముల సర్వే నంబర్లతో విక్రయాలు

వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమిలను ఆక్రమించిన ఆ పార్టీ నేతలు

ఇప్పుడు కూటమి నేతల సహకారంతో అమ్మకాలు

స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

సబ్బవరం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని వెదుళ్లనరవ (జీవీఎంసీ పరిధి)లో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణ జరిగిపోతున్నది. సమీపంలో వున్న కూర్మన్నపాలెం, దువ్వాడ, గాజువాక ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుండడంతో ఇక్కడ భూములకు, స్థలాలకు గిరాకీ పెరిగింది. గజం స్థలం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతున్నది.

వెదుళ్లనరవలో జిరాయితీ భూముల కంటే ప్రభుత్వ భూములే అధికంగా వుండడంతో కొంతమంది నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం మొదలుపెట్టారు. పలు సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను ఇప్పటికే కొంతమంది రియల్టర్లు, రాజకీయ నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. సమీపంలో వున్న జిరాయితీ భూముల సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. కానీ కొనుగోలుదారులకు ఇది ప్రభుత్వ భూమి అని తెలియక, పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కొంతమంది స్థలం చుట్టూ ప్రహరీగోడలు నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ విక్రయాల విషయంలో అధికార, విపక్ష నాయకులు ఏకతాటిపై నడుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ భూముల్లో ఎక్కువ శాతం వైసీపీ నేతల చేతుల్లో వున్నాయి. ఇప్పుడు కూటమి నేతల సహకారంతో విక్రయాలు జరుపుతూ, వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు. కాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చేతులు మారుతుండడంపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వెదుళ్లనరవ 113 సర్వే నంబర్‌లో 1.85 ఎకరాల ప్రభుత్వ భూమి, గెడ్డ వున్నాయి. 114 సర్వే నంబర్‌లో 3.44 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉంది. ఈ రెండు నంబర్లలో ఉన్న మొత్తం 5.29 ఎకరాలను స్థానిక నేతలు ఆక్రమించడమే కాకుండా ఏకంగా విక్రయించేశారు. కొనుగోలు చేసిన వారు స్థలాల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మిస్తుండడంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. సర్వే నంబరు 113తోపాటు సర్వే నంబరు 121లోని ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ, జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయితే చూడలేదని చెబుతున్నారు. ఇంకా సర్వే నంబరు 34లో 15.02 ఎకరాల భూమి ఉంది ఇందులో సుమారు నాలుగు ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో వుండగా, మిగిలినది డి.పట్టా భూమి. మొత్తం 15.02 ఎకరాలు గతంలోనే చేతులు మారింది. ఇక్కడ స్థలాల్లో కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ప్రహరీగోడలు నిర్మించారు.

సర్వే నంబరు 33లో సుమారు ఐదు ఎకరాల్లో అల్లిమెట్ట ఉంది. దీనిపై ఆలయం నిర్మించేందుకు స్థానిక నేతలు యంత్రాలతో చదును చేయించారు. ఇదే అదనుగా భావించి కొంతమంది అల్లిమెట్ట చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:40 AM