ప్రభుత్వ భూమి కబ్జా
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:57 AM
అది ప్రభుత్వ భూమి. నగర నడిబొడ్డున మురళీనగర్ సమీపంలో బర్మా క్యాంప్‌నకు ఎగువన కొండకు ఆనుకుని ఉంది.
మురళీనగర్ సమీపంలో మూడు ఎకరాలు అన్యాక్రాంతం
బిట్‌లుగా విభజించి విక్రయం
48 గజాలు రూ.ఐదు లక్షలు, 60 గజాలు రూ.ఆరు లక్షలు, 180 గజాలు రూ.15 లక్షలు చొప్పున అమ్మకం
రోజుకొకటి చొప్పున వెలుస్తున్న షెడ్‌లు
జిల్లా కలెక్టర్‌కు స్థానికుల ఫిర్యాదు
(విశాఖపట్నం, మురళీనగర్-ఆంధ్రజ్యోతి)
అది ప్రభుత్వ భూమి. నగర నడిబొడ్డున మురళీనగర్ సమీపంలో బర్మా క్యాంప్‌నకు ఎగువన కొండకు ఆనుకుని ఉంది. అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు బోర్డు కూడా ఏర్పాటుచేశారు. కొంతమంది కబ్జాదారులు విలువైన ఆ భూమిపై కన్నేశారు. బిట్‌లు బిట్‌లుగా చేసి రూ.లక్షలకు విక్రయించేస్తున్నారు. దీనిపై స్థానికులు జిల్లా కలెక్టర్‌తోపాటు జీవీఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మురళీనగర్ సమీపంలో బర్మా క్యాంప్‌నకు ఎగువన కొండను ఆనుకుని సర్వే నంబర్ 13ఏ, 14లో మూడు ఎకరాలు భూమి ఉంది. ప్రభుత్వభూమిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేయడంతో ఆ భూమి చాలాకాలంగా ఖాళీగానే ఉంది. ఆ భూమిలోని కొంత భాగంలో బర్మా కాందిశీకులు పునరావాస సంక్షేమ సంఘం పేరుతో 14 ఏళ్ల కిందట ఒక సంఘం ఏర్పాటైంది. ఆ ప్రాంతంలో ఇంటి స్థలం లేని కాందిశీకులతోపాటు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కృషిచేస్తామని ఆ సంఘం ప్రకటించింది. సంఘం పేరుతో అజయ్‌కల్లాం నగర్, భీమ్‌నగర్ వంటి పేర్లతో ఆర్చ్ మాదిరిగా బోర్డు పెట్టుకున్నారు. అయితే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై చాలాకాలంగా కన్నేసిన కొందరు ఆ సంఘంలో సభ్యులుగా చేరారు. తర్వాత సంఘం పేరుతో ఆ భూమిని 48 గజాలు, 60 గజాలు, 180 గజాలు చొప్పున విభజించి ఇతర ప్రాంతాలకు చెందిన వారికి, ఇప్పటికే ఇల్లు/ఇంటి స్థలం ఉన్నవారికి రూ.ఐదు లక్షలు, రూ.ఆరు లక్షలు, రూ.15 లక్షలు చొప్పున విక్రయించసాగారు. నగర నడిబొడ్డున స్థలం కావడంతో చాలామంది అక్కడి స్థలాలను కొనేసుకుంటున్నారు. స్థలం కొనుక్కున్నవారు వెంటనే షెడ్ నిర్మించుకునేలా విక్రయదారులు దగ్గరుండి సహకరిస్తున్నారు. దీంతో రోజుకొకటి చొప్పున షెడ్ వెలుస్తోంది. ఆ షెడ్‌లకు ఇంటి పన్నుతోపాటు కొళాయి కనెక్షన్ ఇప్పించాలంటూ జీవీఎంసీ అధికారులను ప్రలోభాలకు గురిచేసి పనిచేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ కళ్లెదురుగానే రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుండడంతో కొందరు స్థానికులు, నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్యవేదిక పేరుతో మరికొందరు కలిసి ఇటీవల జిల్లా కలెక్టర్‌కు, జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
కబ్జాదారులకు సహకారం
కబ్జాదారులకు అధికారంలో ఉన్న కొందరు సహకరిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఆ భూమిలో షెడ్‌లు నిర్మించుకుంటున్నవారి జోలికి వెళ్లొద్దని గోపాలపట్నం తహశీల్దార్‌తోపాటు ఉత్తర జోన్ జీవీఎంసీ అధికారులను ఆదేశించారని, అందుకే ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ రూ.కోట్ల విలువైన భూమిని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.