కబ్జా చేసి... ప్లాట్లు వేసి...అమ్మేసి
ABN , Publish Date - May 05 , 2026 | 12:46 AM
ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా విభజించి, విక్రయాలు చేపట్టి జేబులు నింపుకుంటున్నారు.
పాలవలసలో ప్రభుత్వ భూమి, గెడ్డ ఆక్రమణ
రెండు, మూడు సెంట్లు చొప్పున విడగొట్టి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు విక్రయం
ప్రభుత్వ కాలనీకి ఆనుకుని అక్రమాలు
కొద్దిరోజులుగా జోరందుకున్న నిర్మాణాలు
విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):
ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా విభజించి, విక్రయాలు చేపట్టి జేబులు నింపుకుంటున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా తూతూమంత్రంగా పరిశీలించి చేతులు దులుపుకుంటున్నారు. ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో ప్రభుత్వ భూమిని కొంతమంది పెద్దలు ఆక్రమించుకుని, ఇళ్ల నిర్మాణాలకు వీలుగా ప్లాట్లుగా విభజించారు. ఆ తరువాత దర్జాగా విక్రయాలు చేపట్టారు. కొనుగోలుదారులు ఆయా స్థలాల్లో భవన నిర్మాణాలు కూడా చేపడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పాలవలస పంచాయతీ గుడిలోవలో 40, మెట్టవానిపాలెంలో 19, పాలవలసలో 42 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు మంజూరుచేసింది. జాతీయ రహదారికి ఆనుకుని గుడిలోవ నుంచి ఆనందపురం టోల్‌గేట్ వరకు ఈ పంచాయతీ పరిధి విస్తరించింది. ప్రభుత్వం మంజూరుచేసిన ఇళ్ల కాలనీకి ఆనుకుని ప్రభుత్వ భూమి, పక్కన గెడ్డ వాగు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో వీఎంఆర్‌డీఏ భారీ లేఅవుట్ అభివృద్ధి చేసింది. రోడ్లు, డ్రైన్లు వేయడంతో లేఅవుట్‌కు డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో పాలవలస కాలనీకి ఆనుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి, గెడ్డపై కొందరు పెద్దల కన్ను పడింది. ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించి, ప్లాట్లుగా విభజించి ఎంచక్కా అమ్మేస్తున్నారు. రెండు నుంచి మూడు సెంట్లను ఒక్కో ప్లాటుగా విభజించి రూ.12 లక్షలు, విస్తీర్ణం ఎక్కువగా ఉంటే రూ.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఆక్రమిత భూముల్లో ఇప్పటికే సుమారు 15 నుంచి 20 ప్లాట్లు విక్రయించినట్టు సమాచారం. ఆయా స్థలాల్లో కొనుగోలుదారులు భవన నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై గ్రామంలోని కొందరు గతంలో ఆనందపురం తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. దిగువస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా విచారణ చేపట్టి, ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టోల్‌గేటుకు ఆనుకుని సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని రక్షించి, పేదలకు పట్టాలివ్వాలని, ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు.