అరుదైన పూల సాగుపై పరిశోధనలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:32 PM
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అరుదైన పూల సాగుపై పరిశోధనలు పునఃప్రారంభంకానున్నాయి. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ కలిగిన ఉత్తర భారతీయ అరుదైన పూలపై ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారుల సహకారంతో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టారు.
ఐదేళ్ల క్రితం అరుదైన ఉత్తర భారతీయ రకాలపై శాస్త్రవేత్తల అధ్యయనం
సహకరించని గత వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఊతం
పునఃప్రారంభించనున్న ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
చింతపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అరుదైన పూల సాగుపై పరిశోధనలు పునఃప్రారంభంకానున్నాయి. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ కలిగిన ఉత్తర భారతీయ అరుదైన పూలపై ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారుల సహకారంతో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రెండేళ్లపాటు పరిశోధనలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పూల సాగును ప్రోత్సహించేందుకు వెనకడుగు వేయడంతో శాస్త్రవేత్తలు పరిశోధనలను అర్థంతరంగా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వ గిరిజన రైతుల ఆర్థిక ప్రగతికి అరుదైన పంటలను ప్రోత్సహిస్తుండడంతో ఈ పూల రకాలపై అధ్యయనం చేసేందుకు ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు.
పాడేరు రెవెన్యూ డివిజన్ వాతావరణం, నేలలు పూల సాగుకు అత్యంత అనుకూలమని సుమారు 25 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు ద్వారా నిరూపించారు. స్థానిక ఆదివాసీలు పలు రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటున్నారు. బంతి పూలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతం పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతుండడంతో లంబసింగి, అరకులోయ ప్రాంతంలో మైదాన ప్రాంతానికి చెందిన స్థానికేతర రైతులు భూమిని లీజుకు తీసుకుని గ్లాడియోలస్, బంతి పంటలను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులకు పూల సాగును పరిచయం చేసేందుకు 2021లో నాటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సురేశ్ కుమార్ పూల సాగుపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్లపాటు పరిశోధన స్థానంలో పూలసాగుపై అధ్యయనం చేశారు. 2022లో పర్యాటక ప్రాంత రైతులతో ప్రయోగాత్మక సాగు ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు రూపొందించి నాటి వైసీపీ ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడం, పూల పరిశోధనలు నిర్వహించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయకపోవడం వల్ల శాస్త్రవేత్తలు అర్థంతరంగా నిలిపివేశారు.
ఎనిమిది రకాలపై అధ్యయనం
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2021, 2022లో ఎనిమిది పూల రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు బెంగళూరు, ఢిల్లీ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ కలిగిన అరుదైన పూల రకాలు నేల సంపంగి, చామంతి, చైనా అస్టర్, గ్లాడియోలస్, లిల్లియం, జెర్బరా, తులీప్, మేరీగోల్డ్ మొక్కలను దిగుమతి చేసుకున్నారు. ఈ అరుదైన పూల మొక్కలపై ఖరీఫ్, రబీతో పాటు వేసవిలోనూ ప్రయోగాత్మక సాగు చేపట్టి పరిశోధనలు నిర్వహించారు. గ్లాడియోలస్, మేరీగోల్డ్, చైనా అస్టర్, లిల్లియం, జెర్బరా ప్రయోగాత్మక సాగులో శాస్త్రవేత్తలు ఉత్తమ ఫలితాలు సాధించారు. తులిప్ మినహా నేల సంపంగి, చామంతి, చైనా అస్టర్, గ్లాడియోలస్, లిల్లియం, జెర్బరా, తులిప్, మేరీగోల్డ్ పూల మొక్కలు విరబూశాయి. బెంగళూరు కంటే పరిమాణం, నాణ్యతలో పరిశోధన స్థానంలో సాగుచేసిన పూలు మేలిరకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్లాడియోలస్ పూల ఎత్తు కూడా బాగా వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముందస్తు రబీలో పరిశోధనలు
స్థానిక ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ముందస్తు రబీలో పూల సాగుపై పరిశోధనలు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. తులిప్, నేల సంపంగి, చామంతి, చైనా అస్టర్, గ్లాడియోలస్, లిల్లియం, జెర్బరా, తులిప్, మేరీగోల్డ్ పూల మొక్కలను ఉత్తర భారత దేశం నుంచి దిగుమతి చేసుకుని ప్రయోగాత్మక సాగు ప్రారంభించనున్నారు. తులిప్ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజన రైతులకు పరిచయం చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.