Share News

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:24 AM

జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. గిరిజన రైతులు సేంద్రీయ పంటలను సాగు చేసుకునేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది.

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం
రింతాడలో సేంద్రీయ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ బీవీ తిరుమలరావు

జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ

ఎరువుల వినియోగంపై నియంత్రణ

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా యూరియా, డీఏపీ పరిమితంగా పంపిణీ

చింతపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. గిరిజన రైతులు సేంద్రీయ పంటలను సాగు చేసుకునేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. ఎరువుల వినియోగంలో నియంత్రణకు శ్రీకారం చుట్టింది. రైతులకు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ సహాయంతో బయోమెట్రిక్‌ ఆధారంగా పరిమితంగా యూరియా, డీఏపీ పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో సేంద్రీయ పద్ధతిలో పంటలను పండించేందుకు అనువైన వాతావరణం, భూములు కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే ఉన్నాయని నిపుణుల ప్రత్యేక సర్వే ఆధారంగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. గిరిజన రైతులతో పంటలన్నీ సేంద్రీయ పద్ధతిలో సాగు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో గిరిజన రైతులు 1.54 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. రైతులు వ్యవసాయ, ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే పండించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రారంభించింది. రసాయనిక ఎరువుల వినియోగాన్ని నియంత్రిస్తూ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను దగ్గర చేస్తూ పంటలు పండించేందుకు వ్యవసాయశాఖ అవసరమైన సహాయక సహకారం అందిస్తున్నది.

రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు

రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 90 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను పంపిణీ చేసింది. భూమిలోని సూక్ష్మదాతువులు, పోషకాల లోపాన్ని పరిష్కరించుకునేందుకు జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను పంపిణీ చేసింది. అధికారులు ఏజెన్సీ పదకొండు మండలాల్లో 950 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులను రైతులకు అందజేశారు. ఒక్కొక్క రైతుకి గరిష్ఠంగా ఐదు ఎకరాలకు సరిపడే పచ్చిరొట్ట విత్తనాలు 10-12 కిలోలు పంపిణీ చేశారు. రైతులు మే నెలలోనే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను పంట పొలాల్లో నాట్లు వేసుకుని 45 రోజుల తరువాత భూమిలో కలియదున్నుకున్నారు. పచ్చిరొట్ట ఎరువు వల్ల పంటలకు అవసరమైన పొటాషియం, నత్రజనితో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా అందుతాయి.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ

వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతిలో సాగు చేసుకునేందుకు చేపట్టాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా జీవామృతం, ఘన జీవామృతం, వివిధ రకాల కషాయాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రయోగాత్మకంగా రైతులకు వివరిస్తున్నారు. ఏపీసీఎన్‌ఎఫ్‌(ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) ద్వారా రైతులకు సేంద్రీయ ఎరువులు, కషాయాలను అందజేస్తున్నారు. ఆత్మ పథకం ద్వారా రైతులకు జీవన ఎరువులను పంపిణీ చేస్తున్నారు.

ఎరువుల వినియోగంలో నియంత్రణ

జిల్లాలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని వ్యవసాయశాఖ పూర్తిగా నియంత్రించింది. జిల్లాలో ఖరీఫ్‌ పంటలు పండించేందుకు 35,646 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. అయితే ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు జిల్లాకు కేవలం 1,400 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కేటాయించింది. తొలి విడతగా 728 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసింది.

పారదర్శకంగా ఎరువుల పంపిణీ

ఎరువులను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఏఐఎంఎస్‌ 2.ఓ సహాయంతో ఆధార్‌ బయోమెట్రిక్‌ ఆధారంగా ఎరువులను పంపిణీ చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు ఎరువుల డీలర్లు సైతం ఈ యాప్‌ సహాయంతోనే ఎరువులు విక్రయించాల్సి వుంది. ఈ యాప్‌లో ఆధార్‌ ఎంటర్‌ చేస్తే రైతు సాగులో ఎంత భూమి ఉంది?, రైతులకు యూరియా, డీఏపీ ఎంత పరిమాణం కేటాయించిందో తెలుస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో మాత్రమే రైతులు ఎరువులను రైతు సేవా కేంద్రం, ప్రైవేటు దుకాణాల ద్వారా పొందవచ్చు. బయోమెట్రిక్‌ లేకుండా కిలో యూరియా కూడా విక్రయించే పరిస్థితి లేదు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, జి.మాడుగుల మండలాల రైతులు నర్సీపట్నంలో, పాడేరు రైతులు చోడవరం, అనంతగిరి, అరకులోయ రైతులు శృంగవరపుకోటలోనూ ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

Updated Date - Aug 25 , 2026 | 12:24 AM