సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:37 AM
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకుంటూ పంటలు పండించుకునేందుకు ప్రభుత్వం సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. పొలంలో బోరు, విద్యుత్తు మోటారు వున్న రైతులకు రాయితీపై బిందు సేద్యం పరికరాలను అందజేస్తున్నది.
రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు
ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ,
ఇతరులకు 70 నుంచి 90 శాతం వరకు రాయితీ
ఈ ఏడాది జిల్లాలో 1,100 హెక్టార్లు లక్ష్యం
రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు
ఇప్పటికే 550.34 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు ఏర్పాటు
అనకాపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకుంటూ పంటలు పండించుకునేందుకు ప్రభుత్వం సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. పొలంలో బోరు, విద్యుత్తు మోటారు వున్న రైతులకు రాయితీపై బిందు సేద్యం పరికరాలను అందజేస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి జిల్లాలో కొత్తగా 1,100 హెక్టార్లలో బిందు సేద్యం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస యోజన (పీఎం-ఆర్‌కేవీవై)లోని ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ (పీడీఎంసీ) పథకం కింద రైతులకు బిందు సేద్యం పరికరాలను అందజేస్తారు. బిందు సేద్యంతో మొక్కలకు అవసరమైన నీటిని అందించవచ్చు. కలుపు సమస్య కూడా తగ్గుతుంది. ఫెర్టిగేషన్ ప్లాంట్ ద్వారా ఎరువులు వృథా కాకుండా నేరుగా మొక్కలకే అందుతాయి. సాధారణ పద్ధతిలో పొలాలకు నీరు పెట్టే దానితో పోలిస్తే బిందు సేద్యంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
సూక్ష్మ సేద్యంలో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ (పూర్తి ఉచితంగా) బిందు సేద్యం పరికరాలను అందజేస్తున్నది. ఒక్కో రైతు గరిష్ఠంగా రూ.2.18 లక్షల మేర లబ్ధి పొందే అవకాశం వుంది. ఇతర వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఐదు ఎకరాలకు మించి, పది ఎకరాల లోపు వున్న రైతులకు 70 శాతం రాయితీ వుంటుంది. బిందు సే సేద్యం పరికరాలు అవసరమైన రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో పేర్లను రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. అక్కడ వున్న ఎంఐఏఓలు ఆయా రైతుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
అనకాపల్లి జిల్లాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,100 హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని విధించగా.. ఇంతవరకు 1,224 మంది రైతులు 1255 హెక్టార్లకు బిందు సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 559 మంది రైతులకు చెందిన 550.34 హెక్టార్లలో బిందుసేద్యం పరికరాల ఏర్పాటు పూర్తయ్యింది. నాణ్యత లేని బిందు సేద్యం పరికరాలతో రైతులు నష్టపోకుండా జిల్లాలో ఐదు ప్రామాణిక కంపెనీలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పొలంలో పరికరాలను ఏర్పాటు చేసి, వినియోగంలోకి వచ్చిన తరువాతే ఆయా కంపెనీలకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. పొలంలో బోరు, విద్యుత్ మోటారు వున్న రైతులు సూక్ష్మ సేద్యం పరికరాల కోసం సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సూక్ష్మ సేద్యం అధికారి జీవీ లక్ష్మి కోరారు.