Share News

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:06 AM

జిల్లాలో తొలిసారిగా ఉద్యానశాఖ అధికారులు రాంబుటాన్‌ మొక్కలను పరిచయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 328.092 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ సాగు చేపట్టేందుకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లపాటు రైతులకు సాగు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఈ ఉద్యాన పంటల ద్వారా గిరిజన రైతులు సుస్థిరమైన ఆదాయం పొందనున్నారు.

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
రాంబుటాన్‌ మొక్కలను పంపిణీ చేస్తున్న డీహెచ్‌వో బాలకర్ణ, అధికారులు(ఫైల్‌)

- తొలిసారిగా గిరిజన రైతులకు రాంబూటాన్‌ మొక్కల పంపిణీ

- జిల్లాలో 328 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ నాట్లు

- రెండేళ్ల పాటు సాగుకు ప్రభుత్వ సహకారం

చింతపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిసారిగా ఉద్యానశాఖ అధికారులు రాంబుటాన్‌ మొక్కలను పరిచయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 328.092 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ సాగు చేపట్టేందుకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లపాటు రైతులకు సాగు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఈ ఉద్యాన పంటల ద్వారా గిరిజన రైతులు సుస్థిరమైన ఆదాయం పొందనున్నారు.

గిరిజన ప్రాంతంలో తక్కవ సమయంలో అధిక ఆదాయం పొందాలని ఆదివాసీలు గతంలో గంజాయి సాగుపై ఆకర్షితులయ్యారు. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు అల్లూరి సీతారామరాజు జిల్లా వైపు చూపించేవి. గత వైసీపీ ప్రభుత్వం గంజాయి సాగును కట్టడి చేయడంలో విఫలమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిని నియంత్రించేందుకు ఈగల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో గిరిజన ప్రాంతంలో ఆదివాసీల సాగులో ఉన్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈగల్‌ వ్యవస్థ కృషి ఫలితంగా గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చింది. ప్రస్తుతం ఒడిశా ప్రాంతంలో పండించిన గంజాయి గిరిజన ప్రాంతం మీదుగా తరలిస్తున్నారు. ఇప్పటికే గిరిజనులను గంజాయి సాగుకు దూరం చేసేందుకు రాజ్‌మా విత్తనాలను 90 శాతం రాయితీపై అందజేస్తున్నారు. 50 శాతం రాయితీపై జీవన ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది వీసీసీ పథకంలో భాగంగా శతశాతం రాయితీపై రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే గిరిజన రైతులకు కాఫీ తరహాలో విదేశీ ఉద్యాన పంటలను సాగు చేసుకోవడం వల్ల దీర్ఘకాలం ఆదాయం పొందే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఉద్యానశాఖ ద్వారా గిరిజన రైతులకు రాంబుటాన్‌, లిచీ, అవకాడో మొక్కలను పంపిణీ చేస్తోంది.

తొలిసారిగా రాంబుటాన్‌ సాగు

గిరిజన ప్రాంతంలో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా గిరిజన రైతులు తక్కువ విస్తీర్ణంలో లిచీ, అవకాడో పంటలను సాగు చేస్తున్నారు. వీబీ జీరామ్‌జీ(వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ గ్రామీణ్‌) ద్వారా అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్‌ మొక్కలను పంపిణీ చేస్తున్నారు. తొలిసారిగా అత్యధిక పోషక విలువలు కలిగి రాంబుటాన్‌ పంటను ఉద్యానశాఖ పరిచయం చేస్తున్నది. ఏడు మండలాల్లో 20.82 హెక్టార్లలో 95 మంది రైతులతో రాంబుటాన్‌ నాట్లు వేయిస్తున్నారు. రాంబుటాన్‌ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యత ఆధారంగా కిలో రూ.300 నుంచి రూ.350 ధర పలుకుతుంది. మొక్కలు నాటిన నాలుగో ఏట నుంచి దిగుబడులు ప్రారంభంకానున్నాయి. రాంబుటాన్‌ సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలమని శాస్త్రవేత్తలు సిఫారసు చేయడంతో ఉద్యానశాఖ మొక్కల పంపిణీని ప్రారంభించింది.

గంజాయి సాగు విడిచిపెట్టిన రైతులకు ప్రాధాన్యం

విదేశీ ఉద్యాన పంటల సాగులో గంజాయి సాగును విడిచిపెట్టిన రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా పోలీసు అధికారులు గంజాయి సాగు విడిచిపెట్టిన రైతుల జాబితాను ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌ టి.నిషాంతి గంజాయి విడిచిపెట్టిన రైతులకు విదేశీ ఉద్యాన పంటల సాగులో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 10 మండలాల పరిధిలో ఉన్న 30 శాతం మంది గంజాయి సాగు విడిచిపెట్టిన రైతులు, మరో 70 శాతం మంది ఇతర రైతులకు రాంబుటాన్‌, లిచీ, అవకాడో మొక్కలను పంపిణీ చేస్తున్నారు.

పది మండలాల రైతులకు మొక్కల పంపిణీ

జిల్లాలో సాగుకు అనుకూలమైన పది మండలాల రైతులకు రాంబుటాన్‌, లిచీ, అవకాడో మొక్కలను ఉద్యానశాఖ పంపిణీ చేస్తున్నది. అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జి.మాడుగుల, జీకేవీధి మండలాల పరిధిలో ఉన్న 901 మంది రైతులను ఉద్యాన పంటల సాగుకు ఎంపిక చేశారు. అవకాడో 722 మంది రైతులతో 227.6 హెక్టార్లు, లిచీ 86 మంది రైతులతో 19.672 హెక్టార్లు, రాంబుటాన్‌ 95 మంది రైతులతో 20.82 హెక్టార్లతో సాగుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 01:06 AM