Share News

అరుదైన పంటల సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:24 AM

గిరిజన మండలాల్లో రైతులు అరుదైన పంటలను వాణిజ్య సరళిలో సాగు చేసుకునేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సాహం అందిస్తుందని ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ పీవీ సత్యనారాయణ అన్నారు.

అరుదైన పంటల సాగుకు ప్రోత్సాహం
మాట్లాడుతున్న డాక్టర్‌ పీవీ సత్యనారాయణ

వాతావరణ ఆధారిత వ్యవసాయంపై గిరిజన రైతులు దృష్టి పెట్టాలి

ఎల్‌నినోని సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం

ఆచార్య ఎన్‌జీరంగా వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ పీవీ సత్యనారాయణ

చింతపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన మండలాల్లో రైతులు అరుదైన పంటలను వాణిజ్య సరళిలో సాగు చేసుకునేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సాహం అందిస్తుందని ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ పీవీ సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ప్రాంతీయ(నాలుగు జిల్లాలు) వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతం విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగివుంటుందన్నారు. ఈ ప్రాంతంలో అరుదైన పంటలు సాగు చేసుకోవచ్చునన్నారు. ప్రధానంగా రాజ్‌మా, వలిసెలు, వేరుశనగ, పసుపు, అల్లం, కాఫీ, మిరియాలతో పాటు అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ పంటలను రైతులు సాగు చేస్తున్నారన్నారు. ఈ పంటల వలన గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారన్నారు. రానున్న రోజుల్లో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయం చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. రైతులు నాట్లు వేసుకునే కాలంలో స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వస్తుందన్నారు. తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించాల్సిన అవసరం ఉందన్నారు. 2026-27 వార్షిక సంవత్సరంలో గిరిజన రైతులు సాగు చేసేందుకు అనువైన పంటలు, నూతన వంగడాలు, శాస్త్రవేత్తలు చేపట్టాల్సిన పరిశోధనలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ప్రణాళికను సిద్ధం చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళిక ఆధారంగా రైతులు పంటలను సాగు చేసుకోవడం వల్ల వ్యవసాయంలో రాణించవచ్చునన్నారు. గిరిజన రైతులు ఎల్‌ నినోపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో మరో 15 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. గిరిజన ప్రాంత రైతులు సైతం ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం చేస్తుందన్నారు. విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ ఏవీ రమణ మాట్లాడుతూ జీవ వైవిధ్యం, భూసారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేల ఆరోగ్యకరంగా ఉంటే మానవులకు మేలు చేసే పంటలను పండించవచ్చునన్నారు. రైతులు రసాయినిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో రైతులు ఆర్గానిక్‌ పద్ధతిలో పంటలు పండించాలన్నారు. రైతులకు పరిశోధన ఫలితాలను విస్తరణ విభాగం ఎప్పటికప్పుడు చేరవేస్తూ వ్యవసాయ ప్రగతికి కృషి చేస్తుందన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తమర్భ బాబూరావు నాయుడు మాట్లాడుతూ రాజ్‌మా, వలిసెల పంటల్లో మేలిరకం విత్తనాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న మామిడిలో తెగుళ్లు అధికంగా కనిపిస్తున్నాయని, దీనికి పరిష్కారం చూపాలన్నారు. కాఫీ, మిరియాలు తరహాలో అవకాడో, లిచి, డ్రాగన్‌ఫ్రూట్‌, సుగంధ ద్రవ్య పంటల సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అనంతరం స్థానిక ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గత ఏడాది నిర్వహించిన పరిశోధనలు, ఫలితాలను రైతులకు వివరించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన పుస్తకాలు కరపత్రాలను విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ బోర్డు సభ్యుడు వండలం బాలయ్య, మాజీ బోర్డు సభ్యుడు దేవుళ్లు, పార్వతీపురం ఏడీఏ రత్నకుమారి, చింతపల్లి ఏడీఏ బీవీ తిరుమలరావు, సీతంపేట, పాడేరు ఉద్యానశాఖ అధికారి జయశ్రీ, అనుశ్రీ, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బయ్యపురెట్టి, బాలహుస్సేన్‌ రెడ్డి, వివిధ విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, ఎన్‌జీవోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:24 AM