అరుదైన పంటల సాగుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:11 PM
ఆదివాసీ రైతులతో అరుదైన పంటలు పండించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ధన్ ధాన్య క్రిషీ యోజన(పీఎండీడీకేవై) కేంద్ర నోడల్ అధికారి అమిత్ సింగ్లా తెలిపారు.
సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి
పీఎండీడీకేవై కేంద్ర నోడల్ అధికారి అమిత్ సింగ్లా
చింతపల్లి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులతో అరుదైన పంటలు పండించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ధన్ ధాన్య క్రిషీ యోజన(పీఎండీడీకేవై) కేంద్ర నోడల్ అధికారి అమిత్ సింగ్లా తెలిపారు. మంగళవారం రాత్రి లంబసింగి చేరుకున్న ఆయన స్థానిక హరిత రిసార్ట్స్‌లో బస చేశారు. బుధవారం ఉదయం తాజంగి, లంబసింగి గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం తాజంగి రైతు సేవా కేంద్రంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ లంబసింగి, తాజంగి ప్రాంతంలో పీఎండీడీకేవై అమలుతీరు సంతృప్తికరంగా ఉందన్నారు. గిరిజన రైతులు నూనెగింజల పంట, వేరుశనగ, అపరాలు సాగు చేయడంతో పాటు అరుదైన ఉద్యాన పంటలు స్ట్రాబెర్రీ, అవకాడో, బొప్పాయి, కూరగాయల పంటలు, జుకినీ, బ్రకోలి, వివిధ వర్ణాల క్యాబేజీ, లెట్యూస్ సాగు చేయడం అభినందనీయమన్నారు. గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు అరుదైన పంటల సాగుకి అనుకూలిస్తుందన్నారు. ఇప్పటికే గిరిజన రైతులు కాఫీ, మిరియాలు, పసుపు పంటల సాగులో ప్రత్యేక గుర్తింపు సాధించారని చెప్పారు. రానున్న రోజుల్లో గిరిజన రైతులతో స్ట్రాబెర్రీ, అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్, లిచీ, బ్రకోలి, నూల్‌కోల్, లెట్యూస్, జుకినీ పంటలు పండించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆదివాసీ రైతులు వ్యవసాయంలో నూతన యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తున్నారని, గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులందరూ పంటను కేవలం సేద్రీయ పద్ధతిలో మాత్రమే పండించాలన్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించరాదన్నారు. ప్రభుత్వం సేంద్రీయ సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. గిరిజన రైతులు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందన్నారు. ఈ ఉత్పత్తుల వల్ల మానవులతో పాటు పంట పొలాలు ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం రైతులకు రాయితీ విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌బీఎస్ నంద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి కంటా బాలకర్ణ, స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు, చింతపల్లి, జీకేవీధి వ్యవసాయ అధికారులు టి. మధుసూదనరావు, డి.గిరిబాబు పాల్గొన్నారు.