ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:00 AM
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు లేక వరి సాగు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రైతులను గట్టెక్కించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 15 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలను అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేశారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి రైతులకు ఊరట
- 80 శాతం రాయితీపై విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు లేక వరి సాగు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రైతులను గట్టెక్కించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 15 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలను అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేశారు.
జిల్లాలో తొలి దశలో భాగంగా నర్సీపట్నం, చోడవరం వ్యవసాయశాఖ డివిజన్‌ల పరిధిలోని 11 మండలాల్లో మొత్తం 572.5 క్వింటాళ్ల విత్తనాలు మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలకు తరలించారు. ఈ విత్తనాల పంపిణీ పూర్తయితే ఆయా మండలాల్లో 3,418.33 హెక్టార్లలో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 180 క్వింటాళ్ల ఉలవలు, 150 క్వింటాళ్ల జనుము, 100 క్వింటాళ్ల రాగులు, 25 క్వింటాళ్ల జొన్నలు, 2.4 క్వింటాళ్ల కొర్రలు ఇప్పటికే ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
రాయితీ విత్తనాల ధరలు ఇలా...
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు రాయితీపై విత్తనాలు అందించనున్నారు. ప్రభుత్వం 80 శాతం రాయితీ ఇస్తుండగా, మిగిలిన 20 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఉలవ విత్తనం పూర్తి ధర కిలో రూ.74 కాగా, రైతు వాటా రూ.14.80 పైసలుగా నిర్ణయించారు. జనుము కిలో ధర రూ.154 కాగా, రైతు రూ.30.80 చెల్లించాల్సి ఉంటుంది. రాగులు కిలో రూ.76కు రైతు రూ.15.20, జొన్నలు రూ.70కు రూ.14, కొర్రలు రూ.60కు రూ.12 చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా రావాల్సిన శనగ విత్తనాల పూర్తి ధర కిలో రూ.78 కాగా, రాయితీ అనంతరం రైతు రూ.15.60 చెల్లించాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆశాదేవి తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయ గల ఉలవలు, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు నీటి కొరత సమస్యను అధిగమించవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అన్ని మండలాల్లో విత్తనాలు పంపిణీ జరుగుతుందని ఆమె తెలిపారు.