మురిపించిన మన్యం అందాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:06 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుత వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో సందర్శకుల రాక జోరందుకుంది. దీంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలు కళకళలాడాయి.
పోటెత్తిన పర్యాటకులు
పర్యాటక ప్రాంతాల్లో సందడి
పాడేరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుత వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో సందర్శకుల రాక జోరందుకుంది. దీంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలు కళకళలాడాయి.
ప్రస్తుత వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు, మంచు మేఘాలు దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాటపడుతున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ సన్ రైజ్ పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం, తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. దీంతో జిల్లా కేంద్రం పాడేరు, ఆంధ్రాఊటీగా పేరుగాంచిన అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో సందడి నెలకొంది.
లంబసింగిలో...
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా గిరిజన ప్రాంతంలో శీతాకాల వాతావరణం కనిపిస్తుంది. ఉదయం వేళ మంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో లంబసింగి పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం లంబసింగి ప్రకృతిని ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. అలాగే తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్‌లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
తారాబు జలపాతం హొయలు
పెదబయలు: మండలంలోని జామిగూడ పంచాయతీలో గల తారాబు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు గిరుల మధ్యలో నుంచి పాలధారలా జాలువారుతున్న దృశ్యం చూపరులను కట్టిపడేస్తోంది. ఆదివారం ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
బొర్రా గుహల వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దేశ, విదేశాలతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం 2 వేల మంది పర్యాటకులు సందర్శించగా, రూ.2.60 లక్షల ఆదాయం సమాకూరిందని మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.
డుడుమ జలపాతం వద్ద...
ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల డుడుమ జలపాతాల వ్యూ పాయింట్ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో త్రిముఖ జలపాతాలు(మూడు జలపాతాలు) ఒక దానికి ఒకటి పోటీగా వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా జలపాతాలను చూసేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. జలపాతం వ్యూపాయింట్, జలవిద్యుత్ ప్రాజెక్టు పరిసరాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో కనిపించారు. గత రెండు రోజులుగా పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంది.