Share News

ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:59 AM

సైబర్‌ నేరస్థులు సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇంటి నుంచే ఉద్యోగం చేసి, వేలాది రూపాయలుసంపాదించ వచ్చు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వల విసురుతున్నారు. నిజమేనని నమ్మిన పలువురు తమ వివరాలను సైబర్‌ నేరగాళ్లకు (మోసగాళ్లని తెలియక) అందించి, ఆనక నిండా మోసపోతున్నారు.

ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ

విజృంభిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

ఆయాచిత ఆదాయం, ఉద్యోగాలు ఆశ చూపించి ఆన్‌లైన్‌లో మోసాలు

డిజిటల్‌ అరెస్టుల పేరుతో భయపెట్టి మరీ దోపిడీ

జిల్లాలో 13 నెలల్లో 57 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు

బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రూ.5.24 కోట్లు

పోలీసుల ద్వారా బాధితులకు తిరిగి చేరింది రూ.36.12 లక్షలే!

నర్సీపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరస్థులు సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇంటి నుంచే ఉద్యోగం చేసి, వేలాది రూపాయలుసంపాదించ వచ్చు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వల విసురుతున్నారు. నిజమేనని నమ్మిన పలువురు తమ వివరాలను సైబర్‌ నేరగాళ్లకు (మోసగాళ్లని తెలియక) అందించి, ఆనక నిండా మోసపోతున్నారు. మరో వైపు విశ్రాంత ఉద్యోగులను డిజిటల్‌ అరెస్టుల పేరుతో భయపెట్టి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను కొల్లగొడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 57 మంది సైబర్‌ నేరగాళ్ల వలలో పడి రూ.5.24 కోట్లు పోగొట్టుకొన్నారు.

గత సంవత్సవరం నర్సీపట్నం ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగికి పోలీస్‌ వేషధారణలో వున్న సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి, డిజిటల్‌ అరెస్టు పేరుతో వారం రోజులపాటు భయపెట్టి ఆయన బ్యాంకు ఖాతా నుంచి కోటి రూపాయలకు పైగా లాగేశారు. రెండు నెలల క్రితం నర్సీపట్నానికి చెందిన విశ్రాంత గిరిజన ఉపాధ్యాయుడుని కూడా డిజిటల్‌ అరెస్టు పేరుతో మూడు రోజులపాటు తీవ్ర భయాందోళనకి గురి చేశారు. ఆయన బ్యాంకు ఖాతాలో వున్న రిటైర్మెంట్‌ డబ్బులను దోచేయడానికి ప్లాన్‌ వేశారు. తొలుత భయపడిన ఆయన సైబర్‌ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతా నంబర్‌కు తొలుత రూ.20 వేలు పంపించారు. సైబర్‌ నేరగాళ్లు అడిగిన మిగిలిన నగదును డ్రా చేయడానికి బ్యాంక్‌కు వెళ్లారు. ఆయన తీవ్ర ఆందోళన చెందుతుండడం, ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తుండడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఆయనతో మాట్లాడారు. విషయం తెలుసుకొని నగదును విత్‌డ్రా చేయకుండా ఆపగలిగారు. ఆయన బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్‌ చేసి, భయపడవద్దని ధైర్యం చెప్పి ఇంటికి పంపించారు. దీంతో సదరు విశ్రాంత ఉపాధ్యాయుడు సైబర్‌ మోసం నుంచి త్రుటిలో తప్పించుకొన్నారు.

నర్సీపట్నం రామారావుపేటకు చెందిన ఇంజనీరింగ్‌ చేసిన యువతి.. ఉద్యోగం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో వెతుకుతూ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడింది. టాస్క్‌ల పేరుతో ఆమెను మోసం చేసి దఫదఫాలుగా రూ.4 లక్షలు కాజేశారు. గత ఏడాది ఇదే తరహాలో నీలంపేటకు చెందిన ఒక మహిళ.. ఉద్యోగం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో వెతుకుతూ సైబర్‌ వలకు చిక్కుకొని డబ్బులు పోగొట్టుకొన్నారు.

13 నెలల్లో 57 సైబర్‌ నేరాలు, రూ.5.24 కోట్లు దోపిడీ

గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో 57 సైబర్‌ నేరాలు జరిగినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటికి సంబంధించి రూ.5.24 కోట్ల సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. అయితే తాము మోసపోతున్నట్టు కొంతమంది బాధితులు త్వరగా గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై రూ.1,04,42,618 నగదు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలకు జమ కాకుండా ఆపగలిగారు. నమోదైన కేసులకు సంబంధించి రూ.36.12 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు.

పోలీసులు విస్తృత ప్రచారం

సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్‌సిన్హా ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు కూడళ్లలో హోల్డింగ్‌లు ఏర్పాటు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌, 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. ఇంకా ఏకేపీ ఫైల్స్‌ లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. డిజిటల్‌ అరెస్టులు బోగస్‌ అని, ఎవరైనా ఫోన్‌ చేసి డిజిటల్‌ అరెస్టు అంటే నమ్మవద్దని సూచిస్తున్నారు. ఫోన్లను హ్యాక్‌ చేసి సోషల్‌ మీడియా గ్రూపుల్లో లింకులు, మెసేజలు పంపుతారని, అటువంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అదే విధంగా ఇటువంటి వాటిని ఇతర గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేయవద్దని సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల మోసాల విషయంలో చాలా మంది అప్రమత్తంగానే వుంటున్నప్పటికీ కొద్ది మంది మాత్రం భయం లేదా అత్యాశతో మోసపోతున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:59 AM