Share News

ఉపాధి ఊపిరి తీశారు..

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:37 AM

కాంగ్రెస్‌ హయాంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పదేళ్లు పండుగలా నిర్వహిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని భ్రష్టు పట్టించారని పీసీసీ చీఫ్‌ షర్మిల ధ్వజమెత్తారు. అరకులోయ మండలం మాడగడ గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పరిరక్షణ రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసి, నీరుగార్చే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ వీబీ-జీ రామ్‌జీ చట్టాన్ని తెచ్చారని ఆమె ఆరోపించారు.

ఉపాధి ఊపిరి తీశారు..
థింసా కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న షర్మిల

- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి భ్రష్టు పట్టించారు

- బీజేపీపై పీసీసీ చీఫ్‌ షర్మిల ధ్వజం

అరకులోయ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ హయాంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పదేళ్లు పండుగలా నిర్వహిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని భ్రష్టు పట్టించారని పీసీసీ చీఫ్‌ షర్మిల ధ్వజమెత్తారు. అరకులోయ మండలం మాడగడ గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పరిరక్షణ రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసి, నీరుగార్చే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ వీబీ-జీ రామ్‌జీ చట్టాన్ని తెచ్చారని ఆమె ఆరోపించారు. వీబీ-జీ రామ్‌జీ చట్టం కాంట్రాక్టర్ల జేబులు నింపేదని, 100 రోజుల నుంచి 125లకు పనిదినాలు పెంచడం బూటకమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజుల పనిలోని 52 రోజులు కూడా కూలీలకు ఉపాధి కల్పించలేదని, అలాంటిది 125 పని కల్పిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జాబ్‌కార్డులు ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. ఈ చట్టానికి సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వడం, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకు ముందు షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టి గంగాధరస్వామి, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాడగడ గ్రామ మహిళలు షర్మిలను పూలదండలతో సత్కరించి, గిరిజన వస్త్రధారణ, వస్తు ఆలంకరణ చేయించి ముచ్చటపడ్డారు. అలాగే గ్రామ మహిళలు, కాంగ్రెస్‌ నాయకురాలు శాంతికుమారి, తదితరులతో కలిసి షర్మిల థింసా నృత్యం వేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.

Updated Date - Mar 18 , 2026 | 12:37 AM