Share News

వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:12 AM

సీలేరు వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు గురువారం ఇక్కడి ఏపీ జెన్‌కో కల్యాణమండంలో వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగింది.

వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి
సభలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

పంచాయతీ తీర్మానం మేరకు ఉద్యోగాలు

ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఐటీడీఏ పీవో శ్రీపూజ

యువతకు ఉద్యోగాలిస్తే అభ్యంతరం లేదన్న గ్రామస్థులు

సీలేరు 2, ఏప్రిల్‌ (ఆంధ్రజ్యోతి): సీలేరు వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు గురువారం ఇక్కడి ఏపీ జెన్‌కో కల్యాణమండంలో వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీలేరు పంచాయతీ పరిధిలో తగిన విద్యార్హతలు వున్న 50 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి, గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన వారికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. సెక్యూరిటీ గార్డులుగా 15 మంది, ఫైర్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది 11 మందితో ఇతర సిబ్బందిని నియమిస్తామని ఆమె అన్నారు. ఎంపిక అయిన వారికి నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక మారెమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఏరోడ్రోమ్‌ వద్ద లాండింగ్‌ ప్రదేశానికి మెయిన్‌ రోడ్డు నుంచి 1.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతుందని, ఈ పనులను ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టువారే చేస్తారని ఆమె వెల్లడించారు. వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలని ఆమె కోరారు.

ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తి, సర్పంచ్‌ దుర్జో, ఉపసర్పంచ్‌ కె.వల్లీప్రసాద్‌, కూటమినాయకులు, గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ, వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే ఆర్‌వీ నగర్‌ నుంచి పాలగెడ్డ వరకు రహదారిని అభివృద్ధి చేయాలని, లేకపోతే ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. దండకారణ్య రాష్ట్ర విమోచన సమితి రాష్ట్ర అఽధ్యక్షుడు మార్కురాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్‌ మాట్లాడుతూ, వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టులో ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో ప్రాజెక్లును అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్‌ బి.బి.సరిత, సర్వే ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ కె.వెంకటేశ్వరరావు, జీకేవీధి తహశీల్దార్‌ అన్నాజీరావు, ఏపీ జెన్‌కో ఎస్‌ఈ జాకీర్‌ హుసేన్‌, ఈఈ బాలకృష్ణ, ఇన్‌చార్జి ఈఈ జైపాల్‌, ఏడీఈ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీపూజ.. మారెమ్మ ఆలయం ఎదురుగా నిర్మించతలపెట్టిన సీప్లేన్‌ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - Apr 03 , 2026 | 01:12 AM