Share News

ఉద్యోగులు ఉక్కురిబిక్కిరి

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:20 AM

స్టీల్‌ ప్లాంటులో ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి.

ఉద్యోగులు ఉక్కురిబిక్కిరి

తగిన వనరులు సమకూర్చకుండా 100 శాతం ఉత్పత్తి సాధించాలని యాజమాన్యం ఒత్తిడి

ఏడాది కాలంలో వంద మందికి అంతర్గత బదిలీలు

కనీస అవగాహన లేని విభాగాల్లో నియామకం

ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే పలువురి రాజీనామా

సస్పెండ్‌ చేశాక చార్జ్‌మెమోలు

స్టీల్‌ ప్లాంటులో విచిత్రమైన వాతావరణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటులో ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. తగిన వనరులు సమకూర్చకుండా 100 శాతం ఉత్పత్తి సాధించాలని యాజమాన్యం ఒత్తిడి పెడుతోంది. గత మూడేళ్లుగా నిర్వహణ పనులు పూర్తిగా పక్కనపెట్టడంతో ప్లాంటులో యంత్ర పరికరాలు మరమ్మతుకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయడానికి కనీసం విడి భాగాలను కూడా అందించడం లేదు. ప్లాంటు నిర్వహణ మొత్తం అనుభవం లేని కాంట్రాక్టర్లకు అప్పగించి, ఉత్పత్తి లక్ష్యాల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెడుతోంది.

కొన్ని దశాబ్దాలుగా ఒకే విభాగంలో పనిచేస్తూ అనుభవం సంపాదించిన ఉద్యోగులను సంస్కరణల పేరుతో అసలు పరిచయమే లేని విభాగాలకు బదిలీ చేసి అక్కడ పనిచేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశిస్తోంది. దీంతో కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా సింటర్‌ ప్లాంటులో సీనియర్లను పక్కనపెట్టారు. దాంతో ఇప్పుడు వాటిని ఎలా నడపాలో మిగిలిన సిబ్బందికి పాలుపోవడం లేదు.

బదిలీలు చాలా అరుదు

స్టీల్‌ ప్లాంటులో ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ చేయడం చాలా అరుదు. పదోన్నతులు కల్పించినప్పుడో, బలమైన కారణాలు ఉంటే తప్ప బదిలీలు చేసే సంప్రదాయం లేదు. కానీ గత ఏడాదికాలంలో వంద మందికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మానవ వనరుల విభాగంలో పనిచేస్తూ రిటైర్‌మెంట్‌కు దగ్గరైన వారిని తీసుకువెళ్లి బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల వద్ద పనిచేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు చెప్పిన మాట వినకపోతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడడం లేదు.

ఇక్కడ తీరే వేరు

ఏ సంస్థలో అయినా ఉద్యోగి తప్పు చేశాడని భావిస్తే దానిపై సంజాయిషీ కోరుతూ చార్జ్‌ మెమో ఇస్తారు. ఇచ్చిన సమాధానం బట్టి, విచారణ చేపట్టి, తప్పు జరిగిందని భావిస్తే సస్పెండ్‌ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థల్లోను ఇదే విధానం అమలులో ఉంది. కానీ స్టీల్‌ ప్లాంటులో ఇటీవల ఈ విధానం పూర్తిగా మార్చేశారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే ముందు అక్కడి ఉద్యోగులను సస్పెండ్‌ చేసేస్తున్నారు. ఆ తరువాత తాపీగా వారికి చార్జ్‌ మెమో ఇస్తున్నారు. రివర్స్‌ విధానం పాటిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగిని సస్పెండ్‌ చేయాల్సి వస్తే... విధులకు అనుమతించకుండా నెలకు 15 రోజుల జీతం ఇంటికే పంపిస్తారు. అంటే పనిచేయకపోయినా సగం జీతం ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి తప్పు చేసిన వారి నుంచి వివరణ కోరి, విచారణ నివేదిక వచ్చేంత పూర్తిగా పని చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ అహంకారం ప్రదర్శిస్తూ పనిచేయకుండా జీతాలు ఇచ్చి, సంస్థకు నష్టం చేకూరుస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఉన్నత స్థాయి సమీక్ష లేకపోవడంతో యాజమాన్యం నచ్చినట్టు వ్యవహరిస్తోంది.

రోజుకు 5 గంటలు సమీక్షకే

కొత్త అధికారి వచ్చిన తరువాత విభాగాధిపతులు, కీలకమైన అధికారులతో రోజుకు ఐదు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజులో ఐదుసార్లు సమీక్షించాల్సినంత విషయాలు లేకపోయినా విలువైన పని గంటలు వృథా చేస్తున్నారు. పని చేయడానికి అవకాశం ఇవ్వకుండా, లక్ష్యాలపై ప్రతి మూడు గంటలకు మీటింగ్‌ పెడితే ఎలా?...అని ఉన్నతాధికారులు నెత్తి బాదుకుంటున్నారు. ఎంత జీతం వస్తుందో తెలియని ఉద్యోగానికి రోజుకు 12 గంటలకుపైగా కేటాయిస్తున్నామని, అంతేగాకుండా సమావేశాలు పెట్టి, వారు మాట్లాడడం తప్పితే ఇటు నుంచి సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 01:20 AM