ఉద్యోగుల్లో డీఏ సంబరం!
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:45 AM
ప్రభుత్వం ఆరేళ్ల నాటి కరవు భత్యం (డీఏ) బకాయిలను విడుదల చేయడంతో ఉద్యోగ/ఉపాధ్యాయులు సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు.
ఆరేళ్ల నాటి బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నామంటున్న ఉద్యోగులు
సీపీఎస్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు సొమ్ము
ఇతర ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాకు జమ
పోలీసులకు సరండర్ లీవుల చెల్లింపు
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం ఆరేళ్ల నాటి కరవు భత్యం (డీఏ) బకాయిలను విడుదల చేయడంతో ఉద్యోగ/ఉపాధ్యాయులు సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు. సీపీఎస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు బుధవారమే బకాయి మొత్తం జమ కావడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఒక్కో సీపీఎస్ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు రూ.40 వేల నుంచి రూ.80వేల వరకు జమయింది. పాత పింఛన్ విధానంలోని ఉద్యోగ/ఉపాధ్యాయులకు ఐదునెలల బకాయి మొత్తాన్ని వారి పీఎఫ్ ఖాతాలకు జమచేసి, మిగిలిన మొత్తం జనవరి జీతంతో కలిపి ఫిబ్రవరి ఒకటోతేదీన చెల్లించనుంది.
గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018, 2019లో ఉద్యోగులకు కరువు భత్యం బకాయిలు ఉండిపోయాయి. ఆతరువాత అధికారంలోకి వచ్చిన జగన్ విడదల వారీగా పాత బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఈ మేరకు రెండు జీవోలు జారీ చేశారు. కానీ ఐదేళ్ల కాలంలో అవి అమలుకు నోచుకోలేదు. దీనిపై ఉద్యోగ/ ఉపాధ్యాయులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వేతన సవరణ అమలుచేసే సమయంలో 2020 నుంచి 2023 వరకు డీఏలను ఉద్యోగి మూలవేతనంలో కలపడం తప్ప, 2018, 2019 బకాయి డీఏలు విడుదల చేయలేదు. దీనికితోడు సీపీఎస్ ఉద్యోగుల వేతనం నుంచి ప్రతినెలా కట్‌చేసిన సొమ్ము సీపీఎస్ ఫండ్‌కు పంపకుండా జగన్ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకున్నది. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా కట్‌చేసిన మొత్తం బకాయిలను జమచేసింది. 16 నెలలుగా బకాయిలు లేవు. అయితే 2018, 2019 డీఏ బకాయిలు విడుదలచేయాలని ఉద్యోగ/ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సంక్రాంతి కానుకగా ఆ మొత్తాన్ని విడుదల చేసింది.
50 వేల మందికి పైగా లబ్ధి
ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగ/ ఉపాధ్యాయులు, పోలీసులతో సహా సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపుతో ప్రయోజనం చేకూరింది. సీపీఎస్ ఉద్యోగులకు మొత్తం బకాయిలు, పోలీసులకు సరండర్ లీవు మొత్తం విడుదల చేయడంతో ఆయా వర్గాలు సంక్రాంతి పండగను మరింత ఆనందంగా జరుపుకున్నారు.
నిజమైన పండుగ
సీపీఎస్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట మేరకు ఆరేళ్ల నాటి కరవు భత్యం జమచేశారు. ఉద్యోగి/ఉపాధ్యాయుల హోదా మేరకు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు జమయ్యాయి. సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది సంక్రాంతి నిజమైన పండుగ. జీతాల నుంచి కట్‌చేసిన మొత్తం కూడా ప్రభుత్వం ఆయా ఖాతాలకు జమచేసింది. బకాయిలు విడుదలచేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు.
- రొంగలి అప్పలరాజు, సీపీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వంపై సానుకూల దృక్పథం
ప్రభుత్వం ఒకేసారి కరవు భత్యం బకాయిలు విడుదలచేయడం ఉద్యోగ/ఉపాధ్యాయవర్గాల్లో ఆనందం నింపింది. సీపీఎస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమచేసిన ప్రభుత్వం పాత పింఛన్‌విధానంలో ఉన్న వారి పీఎఫ్ ఖాతాలకు ఐదునెలలు జమచేసి, ఒక నెల బకాయి జనవరి జీతంతో చెల్లించనుంది. ప్రభుత్వ పాలన, అభివృద్ధిలో భాగస్వామ్యులైన ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. గత ప్రభుత్వంలో బకాయిల విషయమే మరిచిపోయాం.
- ఇమంది పైడిరాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి