కదలనున్న ఉద్యోగ సంఘ నేతలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:41 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల విభజనకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం...సంఘాల నేతలకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వబోవడం లేదు.
విభజన నుంచి ఎటువంటి మినహాయింపు లేదు
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వం సమాయత్తం
దశాబ్దాల తరబడి నగరంలో పలువురి తిష్ఠ
అందులో కొందరు అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి
విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల విభజనకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం...సంఘాల నేతలకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వబోవడం లేదు. ఉద్యోగులందరి మాదిరిగానే సంఘ నేతల పేర్లు సీనియారిటీ జాబితాలో ఉంటాయి. జిల్లాలకు కేటాయింపు సమయంలో ఆ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. కొన్ని కేటగిరీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వితంతువులు, 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగులు, మానసిక వికలాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన ఉద్యోగులను మాత్రం కోరుకున్న జిల్లా కేటాయిస్తారు. ఈ జాబితాలో సంఘ నేతల గురించి ప్రస్తావన లేదు. మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే సంఘ నేతలను సీనియారిటీ ప్రాతిపదికనే జిల్లాలకు కేటాయించనున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘం పేరుతో కొన్నేళ్లుగా విశాఖలో తిష్ఠ వేసిన నాయకుల్లో జూనియర్లు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రధానంగా రెవెన్యూ అసోసియేషన్, ఎన్జీవో, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల్లో సంఘాలు ఉన్నాయి. అలాగే విద్యా శాఖలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. వీరిలో అనేక మంది బదిలీల సమయంలో మినహాయింపు పొందుతున్నారు. సాధారణంగా సంఘ నేతలకు పదేళ్ల వరకు వెసులుబాటు ఉంటుంది. అయితే జిల్లాలో అనేక మంది సంఘ నేతలు అంతకంటే ఎక్కువకాలం నగరంలోనే ఉండిపోయారు.
తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో భాగంగా సంఘ నేతలుగా ఉన్న పలువురు అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వెళ్లడం ఖాయమనే ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాలకు కేటాయించిన తరువాత ఆయా జిల్లా కేంద్రాల్లో పోస్టింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప నగరంలో ఉండేందుకు వీలుపడదని కొందరు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా ఉద్యోగుల విభజనపై కొన్ని శాఖలు తమ పరిధిలోని సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. విభజనకు ప్రామాణికాలు, నిబంధనలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప సంఘ నేతలకు ఎటువంటి మినహాయింపు లేదని కీలక శాఖ ఉన్నతాఽధికారి ఒకరు స్పష్టంచేశారు.